రోడ్లకు ‘విభజన’ శాపం !
- ఆగిన రూ.100 కోట్ల నిధులు
- పల్లెలకు రూ.47 కోట్లు అవసరం
- సీఎం హామీ అమలయ్యేనా..?
రోడ్ల ప్రగతికి ‘విభజన’ శాపమరుుంది. కొత్త రాష్ట్రం.. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శాఖల కుదింపు జరిగింది. ఇందులో భాగంగా రోడ్లు, భవనాల శాఖ ఇంతవరకు పురుడు పోసుకోలేదు. సంబంధిత శాఖకు అధికార యంత్రాంగం కూర్పు జరగనేలేదు. నిధుల మంజూరు విషయం ఇంతవరకు తేలలేదు. ఈ నేపథ్యంలో రోడ్ల ప్రగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. కంకర రోడ్లపై పాదచారులు, నరకయాతన అనుభవిస్తున్నారు.
చిత్తూరు (అర్బన్): ‘జిల్లాల్లో ప్రతి మారుమూల గ్రామానికీ రోడ్డు సౌకర్యం ఉండి తీరాల్సిందే. రోడ్డు లేకుండా ఏ ఒక్క పల్లె కనిపించడానికి వీల్లేదు.’ ఇవీ ముఖ్యమంత్రి హోదాలో ఇటీవల కుప్పానికి వచ్చిన చంద్రబాబు నాయుడు అధికారులతో అన్న మాటలు. కానీ క్షేత్ర స్థాయిలోకి వెళ్లి చూస్తే వాస్తవ పరిస్థితులు వేరేవిధంగా ఉన్నాయి.
జిల్లాలో రోడ్డులేని గ్రామాలు చాలానే ఉన్నాయి. వీటికి తక్షణం రోడ్డు వసతి కల్పించాలంటే దాదాపు రూ.47 కోట్లు కావాలి. ఇక రోడ్ల నిర్వహణకు రూ.25 కోట్లు అవసరం. ఇవి కాకుండా కొత్తగా రోడ్ల విస్తరణకు రూ.28 కోట్లు కావాలి. అంటే ముఖ్యమంత్రి నోటి వాక్కు ఆగమేఘాల మీద అమలు చేయడానికి అధికారుల వద్ద రూ.100 కోట్లకు పైనే సొమ్ములుండాలి. కానీ ఇన్ని కోట్ల రూపాయలు అధికారుల వద్ద ఉన్నాయా..? కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం నిధులను ఏమైనా విడుదల చేసిందా..? అనే ప్రశ్నలకు సమాధానాలు లేవనే చెప్పవచ్చు.
జిల్లాలో 5188 కి.మీ దూరం వరకు ఆర్‌అండ్‌బీ రోడ్లున్నాయి. ఇందులో 645 కి.మీ జాతీయ రహదారులు, 4428 కి.మీ రాష్ట్ర రహదారులు ఉన్నాయి. 114 కి.మీ ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మితమైన రోడ్లు ఉన్నాయి. ఇవి కాకుండా 1646 కి.మీ దూరం వరకు గ్రామీణ రోడ్లు విస్తరించి ఉన్నాయి. వీటి నిర్వహణ కోసం ప్రతి ఏటా రూ.25 కోట్లు అవసరం. వీటితో పాటు కొత్తగా రోడ్ల నిర్మాణానికి ఏటా రూ.100 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ విడుదలవుతుంది. జిల్లాకు సరిహద్దులో ఉన్న రెండు రాష్ట్రాల రోడ్లు ఇప్పటికే బాగా అభివృద్ధి చెందాయి. మన సరిహద్దు రోడ్లు మాత్రం అంతంతమాత్రంగా దర్శనమిస్తున్నాయి.
రూ.కోట్లతో ముడిపడిన అంశం
జిల్లాలో రోడ్ల నిర్వహణ అంశం కోట్ల రూపాయలతో ముడిపడి ఉంటుంది. ఒక్కో ఏడాదికి దాదాపు రూ.100 కోట్ల వరకు జిల్లాలోని రోడ్ల కోసం నిధులు వస్తుంటాయి. 2013-14 ఆర్థిక సంత్సరానికి ప్రభుత్వం నుంచి రూ.100 కోట్ల వరకు నిధులు విడుదలైతే అధికారులు మార్చి వరకు దాదాపు రూ.97 కోట్ల వరకు చెల్లింపులు చేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే ఎక్కడెక్కడ రోడ్ల నిర్మాణం అవసరం ఉంది, ఎంత నిధులు కావాల్సి ఉందనే విషయాలపై అధికారులు నివేదికలు ఇవ్వడం, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయడం జరిగిపోయి ఉండాలి. సరిగ్గా జూన్ 20 దాటిందంటే అధికారులు రోడ్ల నిర్వహణ, నిర్మాణం కోసం టెండర్లు పూర్తిచేసి క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించి ఉంటారు. కానీ మారిన ప్రత్యేక పరిస్థితుల వల్ల జిల్లాలో రోడ్ల అభివృద్ధికి ఎక్కడికక్కడే నిలిచిపోయింది.
విభజన శాపం...
రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో రోడ్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా మారింది. ఏప్రిల్ మొదటి వారంలో తయారుకావాల్సిన రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలు ఇంకా కాగితాల్లోకి రాలేదు. రాష్ట్రంలో ఇంకా రోడ్లు, భవననాల శాఖకు రూపం పోసుకోకపోవడం, అధికార యంత్రాంగం కూర్పు జరగకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు లేకుండానే జిల్లాలో రోడ్లను అభివృద్ధి చేయూలని చెప్పడం విడ్డూరంగా ఉంది. మాటలు చెప్పిన అదే నోటితో సీఎం నిధుల విడుదల విషయం కూడా చెప్పేస్తే జిల్లాలో రోడ్ల పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది.