కడపలో ప్రత్యేక హోదాపై చర్చ చేస్తున్న వివిధ పార్టీల సభ్యులు
తిరుమలేశుని తొలిగడప.. కోదండరాముడు వెలసిన ఏకశిలానగరం.. ప్రఖ్యాతిగాంచిన పెద్దదర్గా కొలువైన నేల.. సరస్వతీ పుత్రుడు పుట్టపర్తి, సినీ దిగ్గజం ‘చందమామ’ బి.ఎన్.రెడ్డి, మహానేత వైఎస్‌ఆర్ వంటి ప్రముఖులు జన్మించిన పౌరుషాల గడ్డ.. ముందుచూపుగల జ్ఞాన సంపన్నుల కేంద్రమైన కడప గడపలో ప్రత్యేకహోదా నినాదం మిన్నంటింది. విద్యార్థులు,
మేధావులు, వివిధ వర్గాల ప్రతినిధులు మాట్లాడారు.
‘ప్రత్యేకహోదా కోసం.. ఎందాకైనా’ అన్న అంశంపై సాక్షి మీడియా ఆధ్వర్యంలో సోమవారం హరిత టూరిజం హోటల్‌లో నిర్వహించిన లైవ్‌షో, చర్చావేదిక కార్యక్రమం ఆద్యంతం పోరాటపటిమతో సాగింది.
వైవీయూ : శ్రీభాగ్ ఒప్పందం నుంచి నేటి వరకు జరుగుతున్న పరిణామాల్లో ఆంధ్రరాష్ట్ర ప్రజలు, ప్రత్యేకించి రాయలసీమ ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని వేదిక ముందుంచారు. సీమ ప్రజల గొంతుక తడారిపోతున్నా ఇతర ప్రాంతాల ప్రజల దాహార్తిని తీర్చగలిగే గొప్పగుణం, అంతటి ఓర్పు ఇక్కడి మట్టిలోనే కనిపిస్తుంది. సీమకు అన్యాయం జరిగి తిరగబడితే అవతల ఎంతటివారున్నా వెనక్కుతగ్గని పౌరుషం, సాహసం ఇక్కడి వారి నరనరాల్లో కనిపిస్తుంది. అదే నేపథ్యంలో నాలుగేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న ఇక్కడి ప్రజలు, నేతలు, విజ్ఞులు వారి మనసులోని మాటలను స్పష్టంగా చెప్పేశారు. రాజకీయ పార్టీల నేతలు కొంత వారి పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మాట్లాడినా మిగిలిన వారు ప్రత్యేకహోదా కావాల్సిందేనని కుండ బద్ధలు కొట్టారు. ఇందుకోసం కోసం ఒక్కో గొంతుక కలిసి రణన్నినాదం చేశారు.
ఊసరివెల్లి రంగులు మార్చి తన ప్రాణాన్ని కాపాడుకుంటుంటే.. నేటి పాలకులు అబద్ధాలు చెప్పి పదవులను కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తొలుత హోదా ఐదేళ్లు.. కాదు.. పదేళ్లు.. కాదు కాదు.. పదిహేనేళ్లు.. కావాలన్న నాయకులు ఎన్నికల తర్వాత ప్రభుత్వ పగ్గాలు చేపట్టగానే హోదా ఏమైనా సంజీవినా అంటూ రంగులు మార్చారని విమర్శించారు. హోదా సాధన కోసం ఎంతవరకైనా వస్తామని.. వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేయకుండా ఒకే ప్రాంతంపై దృష్టి నిలుపుతామంటే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం తప్పదని, సీమలో హైకోర్టు స్థాపన, కడప ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. అంటూ సీమ ప్రాంత ప్రజల ఆకాంక్షను వెలిబుచ్చారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా విడగొట్టి కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందో ఇప్పుడు హోదా ఇవ్వకుంటే ప్రస్తుత పాలకులకు అదే గతి పడుతుందని హెచ్చరించారు. ‘ప్రత్యేకహోదా కోసం ఎందాకైనా’ చర్చావేదికలో జిల్లా ప్రజలు, నాయకుల మనోభావాలు వారి మాటల్లోనే..
ఐక్యపోరాటం...
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్నాం. దురదృష్టవశాత్తు విడిపోయింది. విభజన చట్టంలో పేర్కొన్నట్లు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే. ఇందుకోసం రాజకీయాలు పక్కనపెట్టి ఐక్యపోరాటం చేయాలి. హోదా ఇవ్వకపోవడంతో రాష్ట్రం వెనుకబడింది. చివరకు ఉద్యోగులకు జీతాలకు కూడా అప్పు తెచ్చుకునే పరిస్థితి తలెత్తింది. అన్ని విధాలుగా వెనుకబడిన రాయలసీమకు న్యాయం చేయాలి.
– కె. సురేష్‌బాబు, కడప నగర మేయర్
సమానంగా నిధులు...
ప్రత్యేకహోదా ఇచ్చేందుకు సాంకేతికంగా ఇబ్బందులు ఉండటంతో హోదాతో సమానంగా ఆంధ్రప్రదేశ్‌కు నిధులను కేంద్రప్రభుత్వం ఇస్తోంది. అయితే ఇక్కడ మాత్రం నిధులు ఇవ్వడం లేదనడం శుద్ధ అబద్ధం. రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి అభివృద్ధి చేయడం బీజేపీకే సాధ్యం. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు, అభివృద్ధిలో బీజేపీకి చిత్తశుద్ధి ఉంది.
– పి. శ్రీనాథ్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
మాటలు కాదు.. చేతుల్లో చూపాలి..
ప్రత్యేక హోదా.. ప్యాకేజీలు, నిధులు అన్నీ మాటల్లోనే కనిపిస్తున్నాయి తప్ప చేతల్లో లేవు. ప్రత్యేకహోదా వస్తేనే రాష్ట్రం ఆర్థికంగా పుంజుకుంటుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. చిత్తశుద్ధి లేని పాలకులు ప్రజలను ఉత్తుత్తి మాటలతో మభ్యపెడుతున్నారు. ఉన్న సమస్యలు చాలవన్నట్లు రాయలసీమను రెండోరాజధాని, సుప్రీంకోర్టు బెంచ్ ఇలా సరికొత్త నినాదాలతో మరోసారి మోసం చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. హోదా కోసం సంపూర్ణంగా మద్ధతు ప్రకటిస్తున్నాం.
– జి. ఈశ్వరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి, కడప
హోదాకు కట్టుబడి ఉన్నాం..
రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. దీనికోసం ఎంతవరకైనా వస్తాం. హోదా వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని విశ్వసించే అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పార్లమెంట్‌లో ప్రకటించారు. తర్వాత వచ్చిన పాలకులు వాటిని తుంగలో తొక్కారు. ప్రత్యేకహోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే.
– పి. కమలమ్మ, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే
³త్యేక తరగతి హోదా ఐనా ఇవ్వండి..
ప్రత్యేకహోదా సాంకేతికంగా ఇబ్బంది అనుకుంటే.. అవే ప్రయోజనాలు చేకూర్చే ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలి. 2003లో మూడు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు అప్పటి ప్రధాని అదే పనిచేశారు. ఇప్పుడు అదే విధంగా ప్రత్యేక తరగతి హోదా ఇచ్చేందుకు ప్రధానమంత్రి ఒక్క సంతకం సరిపోతుంది. ఆ దిశగా అందరూ ఒక్కటై పోరాడితే సాధ్యమవుతుంది.
– రామ్మోహన్, సీపీఎం నగర కార్యదర్శి, కడప
Comments
Please login to add a commentAdd a comment