‘కడప’టికి సైకిల్‌కు శూన్యమే!  | Differences Mark Kadapa In TDP | Sakshi
Sakshi News home page

‘కడప’టికి సైకిల్‌కు శూన్యమే! 

Published Wed, Jan 24 2024 5:55 AM | Last Updated on Sat, Feb 3 2024 9:32 PM

Differences Mark Kadapa In TDP - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప:    తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న శ్రేణులు పరేషాన్‌ అవుతున్నాయి. సీనియారిటీకి విలువ ఇవ్వకపోవడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వంటివి టీడీపీకి మైనస్‌ అవుతున్నాయని పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. బద్వేల్, మైదుకూరు, కడప, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో ఇన్‌చార్జుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి వైఖరి ఇలాగే ఉంటే జిల్లాలో గత ఎన్నికల్లోలాగానే తెలుగుదేశానికి మిగిలేది శూన్యమేననే వాదన ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది. 

రీతి లేని రితీష్‌
బద్వేల్‌లో ఎప్పటి నుంచో టీడీపీకి విధేయతగా ఉన్న దివంగత కర్నాటి శివారెడ్డి (కర్నాటి వెంకటరెడ్డి), బద్వేల్‌ మాజీ జెడ్పీటీసీ శిరీష కుటుంబాలతోపాటు, కలశపాడు బాలిరెడ్డి వంటి వారు ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌చార్జి కొనిరెడ్డి రితీష్‌కుమార్‌రెడ్డి తీరు తమకు అవమానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివంగత మంత్రి వీరారెడ్డి హయాం నుంచి టీడీపీలో ఉన్న సీనియర్‌ నేతలు ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులను చవిచూస్తున్నారు.  

పుట్టెడుజిత్తుల.. ‘పుట్టా’
మైదుకూరు నియోజకవర్గం ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఏకపక్ష వైఖరి వల్ల టీడీపీలో తొలి నుంచి ఉన్న  రెడ్యం వెంకటసుబ్బారెడ్డికి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. దువ్వూరు మండల నేత వెంకట కొండారెడ్డిదీ అదే దుస్థితి. డీఎల్‌ రవీంద్రారెడ్డి మంత్రిగా ఉన్న కాలంలో కూడా రెడ్యం సోదరులు టీడీపీ జెండా కోసం పనిచేశారు. అలాంటి వారినీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఆ  పార్టీ నుంచి సాగనంపేందుకు సిద్ధమయ్యారని శ్రేణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

సెల్ఫ్‌ ఫోకస్‌లో ప్రవీణ్‌రెడ్డి
ప్రొద్దుటూరులో టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కూడా ఒంటెత్తు పోకడలు పోతున్నారు. సీనియర్‌ నేతలు నంద్యాల వరదరాజులరెడ్డి, మల్లెల లింగారెడ్డిలను విస్మరిస్తూ తను మాత్రమే ఫోకస్‌ కావాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఏదేమైనా వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిల వైఖరికి విస్తుపోతున్న సీనియర్‌ నేతలు పార్టీలో కొనసాగాలా లేదా? ప్రత్యామ్నాయమార్గం ఏమిటీ? అనే సందిగ్ధంలో ఉన్నారు.  

మాధవీరెడ్డి దుందుడుకు చర్యలతో విస్తు
తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ ఇన్‌చార్జి మాధవీరెడ్డి దుందుడుకు చర్యలతో తెలుగుతమ్ముళ్లు విస్తుపోతున్నారు. ప్రశాంతతకు కేంద్ర బిందువుగా ఉన్న జిల్లా కేంద్రంలో రెచ్చగొట్టే చర్యలకు ఆమె పాల్పడుతున్నారనే ఆవేదన ఆ పార్టీ సీనియర్ల నుంచి వ్యక్తమవుతోంది. నాయకురాలిగా ఫోకస్‌ కావాలనే తపన ఉండొచ్చు కానీ, బహిరంగంగా అధికార పార్టీ క్యాడర్‌తో వాదనకు దిగడం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజాద్‌బాషాలాంటి స్థాయి ఉన్న వారినీ ఆమె ఏకవచనంతో సంబోధిస్తున్నారని పలువురు ఎత్తిచూపుతున్నారు. సొంత క్యాడర్‌తో కూడా ఆమె దురుసుగా వ్యవహరిస్తున్నారనే వాదన ఉంది. పార్టీ ఇన్‌చార్జిగా ఇప్పుడే ఇలా ఉంటే, అధికారిక హోదా దక్కితే ఆమెను నియంత్రించడం సాధ్యం కాదనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement