పేదింటి కల.. సాకారం ఇలా.. | State Government Announces Actionable Guidelines For The Distribution Of Homesteads As Per Navaratna Scheme | Sakshi
Sakshi News home page

పేదింటి కల.. సాకారం ఇలా..

Published Wed, Aug 21 2019 4:23 AM | Last Updated on Wed, Aug 21 2019 8:15 AM

State Government Announces Actionable Guidelines For The Distribution Of Homesteads As Per Navaratna Scheme - Sakshi

గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు.. పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు స్థలం పట్టణాల్లో జీ ప్లస్‌ 3.. ఎకరంలో 100 యూనిట్లు మహిళల పేరుపై ఉగాది పండుగ రోజు పట్టాల పంపిణీగ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఎంపిక.. లబ్ధిదారుల ముసాయిదా జాబితా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రచురణ తహసీల్దారు, మున్సిపల్‌ కమిషనర్‌ ద్వారా జాబితాకు జిల్లా కలెక్టర్ల ఆమోదం ఇప్పటికే అందుబాటులో 11 లక్షల మందికి ఇళ్ల స్థలాలు  సంప్రదింపులు లేదా భూసేకరణ ద్వారా మరో 14 లక్షల మందికి అవసరానికి మించి ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న భూముల వినియోగం గతంలో ఇచ్చిన స్థలాలు ఉపయోగించుకోకపోతే స్వాధీనంమార్గదర్శకాలతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ 

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలోని నవరత్నాల్లో భాగమైన పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణతో కూడిన మార్గదర్శకాలను ప్రకటించింది. వచ్చే ఉగాది పండుగ రోజు అర్హులైన 25 లక్షల మంది పేదలందరికీ ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అందుకు అనుగుణంగా ఈ పథకాన్ని అమల్లోకి తెస్తున్నారు.

ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక, అవసరమైన స్థలాల గుర్తింపు, సేకరణ తదితర అంశాలతో విధాన పరమైన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ జారీ చేశారు. కుల, వర్గ, మతాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇందు కోసం ఇప్పటి నుంచే అవసరమైన స్థలాలను గుర్తించడం, సేకరించడం, లబ్ధిదారుల ఎంపిక ప్రాతిపదిక, అర్హతలు, పథకం అమలుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.

నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఇల్లు లేని పేదలందరికీ పక్కా గృహాలను దశల వారీగా నిర్మించి ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఉగాది రోజు అర్హులైన 25 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 11 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరో 14 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీకి అవసరమైన భూములను గుర్తించాలని నిర్ణయించారు. 

ఇళ్ల స్థలాలకు అవసరమైన భూమి గుర్తింపు ఇలా.. 

  • అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ జిల్లా కలెక్టర్లు గుర్తించాలి
  • ప్రభుత్వ ఇన్‌స్టిట్యూషన్లు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థలు అవసరానికి మించి భూములు కలిగి ఉంటే గుర్తించి, ఇళ్ల స్థలాలకు అనువుగా ఉంటే నిబంధనల మేరకు స్వాధీనం చేసుకోవాలి.
  • చిన్న చిన్న వివాదాల్లో ఉన్న సీలింగ్‌ భూములు, ఇనామ్, ఎస్టేట్, ఎల్‌టీఆర్‌ భూములను గుర్తించి వివాదాలను పరిష్కరించి కొద్ది నెలల్లోనే స్వాధీనం చేసుకోవాలి.
  • ఇళ్ల స్థలాలకు అనువుగా ఉన్న ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కుల కోసం అభివృద్ధి చేసిన భూములను పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగించాలి.
  • ల్యాండ్‌ పూలింగ్‌ స్కీము కింద భూములు అందుబాటులో ఉంటే స్వాధీనం చేసుకోవాలి.
  • గ్రామ కంఠంలో అర్హులైన లబ్ధిదారులకు సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణాలకు అనుమతిస్తూ పొజిషన్‌ సర్టిఫికెట్‌ జారీ చేయాలి.
  • గతంలో వివిధ శాఖలు ఇళ్ల స్థలాలను మంజూరు చేసినప్పటికీ నిర్మాణాలు చేయకుండా ఖాళీగా ఉంటే అలాంటి స్థలాలను గుర్తించి నిబంధనల మేరకు స్వాధీనం చేసుకోవాలి.
  • ఇల్లు లేని పేదల కోసం ఎవరైనా భూములను దానం చేసేందుకు ముందుకు వస్తే అలాంటి వారిని జిల్లా కలెక్టర్లు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి.
  • సంప్రదింపులు లేదా భూ సేకరణ ద్వారా జిల్లా కలెక్టర్లు అవసరమైన భూములను తీసుకోవాలి. 
  • ఇతర ప్రత్యామ్నాయాలు లేని పక్షంలోనే అసైన్డ్‌ భూములను స్వాధీనం చేసుకుని నిబంధనల మేరకు పరిహారం చెల్లించాలి.
  • గ్రామ, పట్టణ యూనిట్‌గా తగిన ఇళ్ల స్థలాలను గుర్తించాలి.
  • గుర్తించిన ఇళ్ల స్థలాలను జిల్లా కలెక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ శాఖకు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌ శాఖలకు స్వాధీనం చేయాలి.
  • స్వాధీనం చేసుకున్న స్థలాల్లో ఎటువంటి జాప్యం లేకుండా గృహ నిర్మాణ శాఖ, మున్సిపల్‌ శాఖ నిబంధన మేరకు లేఅవుట్స్‌ను రూపొందించాలి.
  • ల్యాండ్‌ సర్వే, సబ్‌ డివిజన్స్‌ లే అవుట్‌ అండ్‌ పెగ్‌ మార్కింగ్‌లో సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ శాఖ సహకారం అందించాలి.
  • గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్ల స్థలాలను చదును చేసేందుకు ఉపాధి హామీ నిధులను వినియోగించేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.
  • పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను చదును చేసేందుకు పట్టణ స్థానిక సంస్థలు, ఏపీటీఐడిసీవో, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు చర్యలు తీసుకోవాలి.
  • భూ సేకరణ పరిహారం చెల్లించేందుకు, లే అవుట్స్‌ రూపకల్పన, వ్యక్తిగత ప్లాటింగ్, ఇతర కార్యకలాపాలకు అవసరమైన నిధులను బడ్జెట్‌ నుంచి రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్లకు సమకూరుస్తుంది.
  • నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అలాంటి వాటిని రద్దు చేసి అర్హులైన ఇతరులకు కేటాయించాలి.

పర్యవేక్షణకు మూడు కమిటీలు  

  • ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం అమలును రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షించేందుకు డిప్యూటీ సీఎం (రెవెన్యూ) అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో మున్సిపల్, గృహ నిర్మాణం, రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్, మున్సిపల్‌ పట్టణాభివృద్ది కార్యదర్శి, సీసీఎల్‌ఏ లేదా ప్రత్యేక సీఎస్, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సభ్యులుగా ఉంటారు. సీసీఎల్‌ఏ ప్రత్యేక కమిషనర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
  • రాష్ట్ర స్థాయిలో సంబంధిత శాఖల మధ్య సమన్వయం కోసం రెవెన్యూ శాఖ (ల్యాండ్‌) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్‌ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి సభ్యులుగా సీసీఎల్‌ఏ ప్రత్యేక కమిషనర్‌ సభ్య కన్వీనర్‌గా కమిటీ ఏర్పాటు చేశారు.
  • జిల్లా స్థాయిలో కార్యక్రమం అమలు పర్యవేక్షణకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన జిల్లా కలెక్టర్‌ కో–చైర్మన్‌గా జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జాయింట్‌ కలెక్టర్, జిల్లా పరిషత్‌ సీఈవో, గృహ నిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్, మున్సిపల్‌ కమిషనర్లు, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ, జిల్లా పంచాయతీ ఆఫీసర్, జిల్లా రిజిస్ట్రార్, గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు. 
  • ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు వీలుగా అవసరమైన సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్, డేటా సేకరణకు సాంకేతిక సహాయాన్ని ఐటీ శాఖ రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ అందిస్తాయి. 
  • జిల్లా స్థాయిలో జాయింట్‌ కలెక్టర్‌ నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. సమన్వయ బాధ్యతలను డిప్యూటీ కలెక్టర్‌కు అప్పగిస్తారు. ఈ కార్యక్రమం అమలు తీరుపై జాయింట్‌ కలెక్టర్‌ తరచూ సీసీఎల్‌ఏకు నివేదిక పంపించాలి.

గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారుల అర్హతలు 

  • దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు తెల్ల రేషన్‌ కార్డు ఉండాలి.
  • లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇళ్ల స్థలం ఉండరాదు.
  • కేంద్ర, రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల కింద గతంలో లబ్ధిదారులుగా ప్రయోజనం పొంది ఉండరాదు.
  • రెండున్నర ఎకరాలకుపైగా మాగాణి లేదా ఐదు ఎకరాలకు పైగా మెట్ట భూమి ఉండరాదు.
  • లబ్ధిదారుల అనుమతితోనే ఆధార్, ఇతర వివరాలు సేకరించాలి.

పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల అర్హతలు 

  • లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడా ఇళ్ల స్థలం ఉండరాదు.
  • కేంద్ర, రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల కింద గతంలో లబ్ధిదారులుగా ప్రయోజనం పొంది ఉండరాదు.
  • రెండున్నర ఎకరాలకు పైగా మాగాణి లేదా ఐదు ఎకరాలకు పైగా మెట్ట భూమి ఉండరాదు.
  • వార్షిక ఆదాయం మూడు లక్షల రూపాయలకు మించ రాదు.
  • లబ్ధిదారుల అనుమతితోనే ఆధార్, ఇతర వివరాలు సేకరించాలి.

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇలా.. 

  • గ్రామ, పట్టణ యూనిట్‌గా గ్రామ, వార్డు స్థాయిలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తారు.
  • అర్హత నిబంధనల మేరకు దరఖాస్తులను గ్రామ, వార్డు వలంటీర్లు పరిశీలిస్తారు.
  • అర్హత గల లబ్ధిదారుల ముసాయిదా జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రచురిస్తారు.
  • ముసాయిదా జాబితాలో లబ్ధిదారులపై అభ్యంతరాలను, క్లెయిమ్‌లను స్వీకరిస్తారు.
  • అభ్యంతరాలను, క్లెయిమ్‌లను పరిగణనలోకి తీసుకుంటూ గ్రామ, వార్డు సభలను నిర్వహించి తుది జాబితాలను ఖరారు చేస్తారు.
  • తుది జాబితాలను గ్రామీణ ప్రాంతాల్లో తహసీల్దార్ల ద్వారా, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్ల ద్వారా జిల్లా కలెక్టర్ల ఆమోదానికి పంపుతారు.
  • జిల్లా కలెక్టర్లు ఆమోదించిన లబ్ధిదారుల జాబితాలను తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రచురిస్తారు.
  • ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, క్లెయిమ్‌లు ఉంటే సంబంధిత తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు జిల్లా కలెక్టర్ల అనుమతితో పరిష్కరిస్తారు. 

మార్గదర్శకాలు ఇవీ..

  • గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు 1.5 సెంట్ల ఇంటి స్థలం ఇస్తారు. వచ్చే ఏడాది ఉగాది పండుగ రోజు మహిళల పేరు మీద పట్టాలను పంపిణీ చేస్తారు.
  • వ్యక్తిగత లబ్ధిదారులు ఆ స్థలాల్లో ఇల్లు నిర్మించుకునేందుకు గృహ నిర్మాణ శాఖ అందుబాటులో ఉన్న పథకాల కింద దశల వారీగా నిధులు మంజూరు చేస్తుంది.
  • పట్టణ ప్రాంతాల్లో జీ ప్లస్‌ 3 విధానంలో ఇళ్ల నిర్మాణం చేపడతారు. ఎకరంలో 100 యూనిట్లు నిర్మిస్తారు. ఇందులో భాగంగా పట్టణ లబ్ధిదారులకు ఒక సెంటు చొప్పున కేటాయిస్తూ మహిళల పేరు మీద ఉగాది రోజున పట్టాలు పంపిణీ చేస్తారు.
  • వ్యక్తిగత లబ్ధిదారులందరి ప్లాట్లకు 11 అంకెలతో విశిష్ట భూధార్‌ నంబర్‌ ఇస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement