తీరంలో గస్తీ ముమ్మరం : ఎస్పీ | Stepped up patrols off the coast of: SP | Sakshi
Sakshi News home page

తీరంలో గస్తీ ముమ్మరం : ఎస్పీ

Published Sat, Feb 8 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

Stepped up patrols off the coast of: SP

  • 7 మెరైన్ బోట్ల ప్రారంభం
  •  ఒక్కో బోటులో 10 మంది నియామకం
  •  నెలకు రూ.1.65 లక్షల అద్దెకు ఏర్పాటు
  •  మచిలీపట్నం, న్యూస్‌లైన్ : తీరం వెంబడి మెరైన్ పోలీసుల ద్వారా గస్తీని ముమ్మరం చేయనున్నట్లు ఎస్పీ జె.ప్రభాకరరావు తెలిపారు. గిలకలదిండి మెరైన్ పోలీస్‌స్టేషన్ వద్ద సముద్రంలో గస్తీ తిరిగేందుకు సిద్ధం చేసిన ఏడు మెరైన్ బోట్లను ఆయన లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిలకలదిండి మెరైన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు బుల్లెట్‌ప్రూఫ్ బోట్లు ఉన్నాయన్నారు.

    ఇవి కాకుండా తమిళనాడు సరిహద్దు నుంచి దక్షిణ కోస్తా సరిహద్దు వరకు సముద్రంలో 24 గంటల పాటు గస్తీ నిర్వహించేందుకు ఏడు బోట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిలో నెల్లూరు జిల్లా శ్రీహరికోట, ఇసుకపల్లి మెరైన్ పోలీస్‌స్టేషన్లకు, ప్రకాశం జిల్లా కొత్తపేట, రామయ్యపేట మెరైన్ పోలీస్‌స్టేషన్లకు, గుంటూరు జిల్లా నిజాంపట్నం మెరైన్ పోలీస్‌స్టేషన్‌కు, కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం ఒర్లగొందితిప్ప, కోడూరు మండలం పాలకాయతిప్ప మెరైన్ పోలీస్‌స్టేషన్లకు ఒక్కొక్క బోటును కేటాయిస్తున్నట్లు తెలిపారు.

    ఆయా ప్రాంతాలకు కేటాయించిన బోట్లు సముద్రంలో ఆరు గంటల పాటు గస్తీ తిరగాల్సి ఉంటుందన్నారు. అవసరమైతే 24 గంటల పాటు సముద్రంలోనే ఉండి విదేశీయులు, తీవ్రవాద చర్యలకు పాల్పడేవారి కదలికలపై ఆ సిబ్బంది నిఘా ఉంచుతారన్నారు. ఒక్కొక్క బోటులో పది మంది సిబ్బందిని నియమించినట్లు చెప్పారు.

    డీజీపీ బి.ప్రసాదరావు, హోంశాఖ సెక్రటరీ టీపీ దాస్, మెరైన్ ఐజీపీ శ్రీనివాసరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తీరంలో గస్తీని ముమ్మరం చేసేందుకు ఈ బోట్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఒక్కొక్క బోటుకు నెలకు 1.65 లక్షల రూపాయలు అద్దె చెల్లించే విధంగా ఏడు సోనా బోట్లను అద్దెకు తీసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బందరు డీఎస్పీ కేవీ శ్రీనివాసరావు, ఎస్‌బీ సీఐ పి.మురళీధర్, మెరైన్ సీఐ సత్యనారాయణ, మెరైన్ ఎస్సై రమణారెడ్డి, మచిలీపట్నం పోలీస్‌స్టేషన్ ఎస్సై శ్రీహరి, సిబ్బంది పాల్గొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement