కాస్తందుకో.. దరఖాస్తందుకో!!
పదేళ్ల పాటు అందని ద్రాక్షలా ఊరించిన అధికారం.. ఎట్టకేలకు వచ్చి ఒళ్లో వాలింది. అంతే పచ్చతమ్ముళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నామినేటెడ్ పోస్టులతో దశ తిరుగుతుందనుకున్నారంతా. కానీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం నోరు మెదపట్లేదు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా నామినేటేడ్ పోస్టులు భర్తీ చేయక పోవడంతో తమ్ముళ్ల ఆవేదన అంతా ఇంతా కాదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాము చేసిన త్యాగాలను తలుచుకుని వారిలో వారే కుమిలికుమిలి పోయారు. మన పరిస్థితి ఉండి దరిద్రం.. లేక దరిద్రంలా తయారైందని చెవులు కొరుక్కుంటున్నారట.
వాళ్లు అంతలా ఎదురుచూసిన సుముహూర్తం రానే వచ్చింది. అధినేత కరుణించారు. నామినేటేడ్ పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపారు. నామినేటేడ్ పోస్టులు కోరుకునే వారు డిసెంబర్ 20లోగా దరఖాస్తు చేసుకోవాలని హుకుం జారీచేశారు. అంతే పచ్చ తమ్ముళ్లలో ఆశలు రెక్కలు విచ్చుకున్నాయి. దీంతో కాస్తందుకో... దరఖాస్తందుకో.. నామినేటేడ్ పోస్ట్కు నా దరఖాస్తు అందుకో అంటూ జిల్లా నాయకులకు పచ్చ తమ్ముళ్లు దరఖాస్తులు చేసుకుంటున్నారు.
దీంతో జిల్లా నాయకులకు దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 10 వేలకుపైగా దరఖాస్తులు అందాయని సమాచారం. చిత్తూరు జిల్లా మొదలుకొని... ఇటు శ్రీకాకుళం జిల్లా వరకు పలు దేవాలయాలు, అభివృద్ధి సంస్థల ఛైర్మన్లు, సభ్యులను నామినేట్ చేసేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేసి... కొత్త సంవత్సరం కానుకగా ఇవ్వనున్నట్లు సమాచారం.