సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల తీరు అధికారులను విస్మయపరుస్తోంది. తమ విధులు తమను చేసుకోనివ్వకుండా రాజకీయ లబ్ధికోసం అడ్డుపడటంపై అంతర్మధనం మొదలైంది. పలాస జీడివ్యాపారులపై దాడులు నిర్వహిస్తున్న అధికారులను సాక్షాత్తూ అధికారపార్టీ నాయకులే అడ్డుపడటం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. జిల్లాలో ఓట్లేసినవారు ఎన్ని అక్రమాలకు పాల్పడినా వారిని రక్షించేస్తారా అన్న ప్రశ్న ఎదురవుతోంది.
అసలేం జరిగింది?
వాణిజ్యపన్నులశాఖ విజయనగరం డెప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొన్నాళ్లనుంచి పలాసాలో జీడిపప్పు పరిశ్రమలపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవల ఓ అకౌంటెంట్ ఇంట్లో వ్యాపారులకు సంబంధించి సుమారు 100రికార్డుల్ని కూడా సీజ్ చేశారు. వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ఎగ్గొడు తూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు భావించిన ఆ శాఖ అధికారులు దాడుల్ని మరింత ఉథృతం చేయాలని ఆరు బృందాలుగా విడిపోయి ఆకస్మిక తనిఖీలకు ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న వ్యాపారులు పలాస మునిసిపల్ చైర్మన్ పూర్ణచంద్రరావు సహా టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శిరీషను ఆశ్రయించగా, ఆమె జిల్లా మంత్రితో మాట్లాడించి విజయనగరం అధికారులతో చర్చించి, అధికారులు వెనుదిరిగిపోయేలా చేశారు.
అక్రమాలు అరికట్టమంటే...
అక్రమాలు అరికట్టాలని... ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేలా చర్యలు చేపట్టాలని ఒకవైపు మంత్రులు చెబుతుంటే ఇక్కడి నేతలు ఇలా తమను అడ్డుకోవడంపై మనసులోనే కుమిలిపోతున్నారు. అంతేగాదు ఇతర వ్యాపారులు సైతం తమపైనా అధికారులు దాడు లు చేస్తే వాటినీ అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైస్‌మిల్లుల్లోనూ అక్రమాలు జరుగుతున్నాయని కొంతమంది వాణిజ్యపన్నులశాఖ కమిషనర్‌తో పాటు విజ యనగరం డీసీకి ఆకాశరామన్న లేఖ పంపించారు. ఇలా అక్రమాలు జరుగుతున్నాయని ఉప్పందుతుంటే వాటిని అరికట్టేందుకు అధికారులు ముందుకు ఉరికినా నేతల ఒత్తిళ్లు ఎదురవుతాయేమోనన్న సందిగ్ధం నెల కొంటోంది.
ఈ నేపథ్యంలో జీడిపప్పు పరిశ్రమల కష్టాలు-అధికారుల దాడులకు సంబంధించి తాను చర్చిస్తానని, ఈ నెల 10వ తేదీన తనను కలవాలని జిల్లా కలెక్టర్..విజయనగరం డీసీని ఆదేశించడంపై కూడా చర్చ జరుగుతోంది. నాయకుల ఒత్తిళ్లకు లొంగిపోతే తాము ఉద్యోగం చేయలేమని కిందిస్థాయి సిబ్బంది కూడా అధికారుల దృష్టికి తెస్తున్నారు. శుక్రవారం జరిగిన సంఘటనపై డీసీ శ్రీనివాసరావు వద్ద సాక్షి ప్రస్తావించగా విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని, వ్యాపారుల అక్రమాల్ని అడ్డుకుంటామని చెప్పారు.
ఇదేం తీరు ?
Published Mon, Aug 10 2015 1:51 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement