రాష్ట్రానికి తెలంగాణ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును-2013 రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసి పంపిన విభజన బిల్లుపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత.. శాసనసభ, శాసనమండలి అభిప్రాయం కోరుతూ దాన్ని యథాతథంగా రాష్ట్రానికి పంపించారు. బిల్లుపై ఆరు వారాల్లోగా ఉభయ సభల అభిప్రాయం చెప్పాలని రాష్ట్రపతి నిర్దేశించారు.
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు నివాళులర్పించి దక్షిణాఫ్రికా పర్యటన నుంచి ఆయన బుధవారం ఉదయం తిరిగి వచ్చారు. పర్యటనకు వెళ్లే ముందే బిల్లుపై న్యాయ, రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాన్ని కోరారు. వారి అభిప్రాయాలను జోడిస్తూ రాష్ట్రపతి భవన్ ఉన్నతాధికారులు బిల్లు ఫైలును బుధవారం మధ్యాహ్నం ప్రణబ్ టేబుల్‌పై ఉంచారని, ఆయన వచ్చిన వెంటనే దానిపై దృష్టి పెట్టారని రాష్ట్రపతి భవన్‌లోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బుధవారం ప్రణబ్ జన్మదినం కావడంతో దక్షిణాఫ్రికా నుంచి వచ్చీ రాగానే తనకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ప్రముఖులతో గడిపారు. సాయంత్రం నుంచి బిల్లును ఆసాంతం పరిశీలించారని తెలియవచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభజన గతంలోని రాష్ట్రాల విభజనకు పూర్తి భిన్నంగా జరుగుతున్న నేపథ్యంలో బిల్లులోని కొన్ని అంశాలపై న్యాయ, రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాన్ని ప్రణబ్ ఒకటికి రెండుసార్లు తరచి చూశారని భవన్ వర్గాలు పేర్కొన్నాయి.
అన్ని అంశాలనూ లోతుగా పరిశీలించిన మీదట గత సంప్రదాయాలను, పద్ధతులను, నిబంధనలను దృష్టిలో పెట్టుకుని... అభిప్రాయం తెలియజేయడానికి అసెంబ్లీకి ఆరు వారాల గడువివ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రణబ్ ఆదేశానుసారం రాత్రి 9 గంటల సమయంలో అధికారులు బిల్లును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతికి పంపినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. బిల్లు రాష్ట్రానికి చేరిన విషయాన్ని అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. బిల్లు ప్రతి రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చీ రాగానే ఉన్నతాధికారులు దాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో పెట్టారని తెలిసింది. ఆరు వారాల్లోగా, అంటే 2014 జనవరి 22 లోగా బిల్లుపై అసెంబ్లీ, మండలి అభిప్రాయాలు తీసుకుని దాన్ని తిరిగి రాష్ట్రపతికి నివేదించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రణబ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్లిన రాష్ట్ర ఎంపీలు పలువురు విభజన అంశాన్ని కూడా ప్రస్తావించి వేర్వేరుగా పలు విజ్ఞాపన పత్రాలను సమర్పించారు.
ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిల్లు లేనట్టే
గురువారం నుంచి శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విభజన బిల్లు రాష్ట్రానికి చేరుకుంది. అభిప్రాయానికి ఆరు వారాల గడువు నిర్దేశించినందున ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో విభజన బిల్లు రాదనే చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు 20వ తేదీతో ముగుస్తున్నాయి. ఆలోపే బిల్లును చర్చకు పెట్టి అభిప్రాయం కోరుతారా, రాష్ట్రపతి ఎటూ ఆరు వారాల గడువిచ్చినందున మళ్లీ ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారా అన్నది తేలాల్సి ఉంది. బిల్లుపై తక్షణం చర్చ జరపాలని తెలంగాణ ఎమ్మెల్యేలు గురువారం సభలో పట్టుబట్టే అవకాశముంది.
దీనిపై బీఏసీ నిర్వహించి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రం నుంచి బిల్లు తిరిగి రాష్ట్రపతికి ఎప్పుడు వెళ్తుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లుపై అభిప్రాయం తీసుకుని రాష్ట్రపతికి నివేదిస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. పార్లమెంటు సమావేశాలను గురువారంతోనే ముగిస్తారన్న పీటీఐ వార్తా సంస్థ కథనం చర్చనీయంగా మారింది. అసెంబ్లీ ఒకట్రెండు రోజుల్లోనే అభిప్రాయం వెల్లడించి బిల్లును రాష్ట్రపతికి పంపినా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో దాన్ని ప్రవేశపెట్టే అవకాశాల్లేవంటున్నారు. రాష్ట్ర ఉభయ సభల్లో వ్యక్తమైన అభిప్రాయాలను పరిశీలించాక బిల్లును రాష్ట్రపతి తిరిగి కేంద్ర మంత్రిమండలికి పంపిస్తారు. అది దాన్ని పరిశీలించి, ఆమోదించి మళ్లీ రాష్ట్రపతికి నివేదించాల్సి ఉంటుంది. తర్వాత కేంద్ర హోం మంత్రి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఇదంతా జరగడానికి ఇప్పుడున్న సమయం సరిపోదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
రాష్ట్రంలో బిల్లు ప్రస్థానమిలా...
రాష్ట్రపతి పంపిన రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, అక్కడి నుంచి ముఖ్యమంత్రికి చేరింది. ఆయన చూశాక దాన్ని గవర్నర్‌కు పంపిస్తారు. గవర్నర్ పరిశీలించాక బిల్లును అసెంబ్లీ కార్యదర్శికి పంపిస్తారు. అక్కడి నుంచి బిల్లు స్పీకర్‌కు చేరనుంది. గతంలో పలు రాష్ట్రాల విభజన సమయంలో ఇదే విధానం అమలైందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. పరిశీలనకు ఒక్కొక్కరు ఒక్కో రోజు తీసుకోవచ్చని చెప్పారు.
విభజనకు జనవరి 29 డెడ్‌లైన్?
రాష్ట్రపతి జనవరి 22ను గడువుగా విధించడంపైనా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ప్రస్తుత లోక్‌సభ కాల పరిమితి 2014 జూన్ 1తో ముగుస్తోంది. ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. అయితే ఎన్నికలకు అప్పటికి మరో మూడు నెలలే ఉంటుంది గనుక ఓట్ ఆన్ అకౌంట్ మినహా ఇతరత్రా మరే కీలక నిర్ణయాలు చేయడానికీ పార్లమెంట్‌కు అధికారం లేదు. ఈ నేపథ్యంలో జనవరి 29లోగా బిల్లుకు ఆమోదముద్ర పడితే తప్ప రాష్ట్ర విభజన జరగదని తెలుస్తోంది. రాష్ట్రపతి గడువుగా విధించిన జనవరి 22లోగా ఇతరత్రా అన్ని అంశాలనూ పూర్తి చేసుకుంటే జనవరి నెలాఖరులో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లు పెట్టే వీలుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన జనవరి మూడో వారంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలుంటాయని కూడా మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగే అవకాశాలు లేనందున ప్రత్యేక సమావేశాల్లోనే బిల్లును చేపడతారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.