ఎన్నికలు ప్రశాంతం : ఎస్పీ | The polls: SP | Sakshi
Sakshi News home page

ఎన్నికలు ప్రశాంతం : ఎస్పీ

Published Fri, May 9 2014 2:25 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

The polls: SP

  • అందరికీ కృతజ్ఞతలు
  •  119 కేసులు
  •  రూ. 3.12 కోట్లు స్వాధీనం
  •  165మద్యం కేసులు, 190 మంది అరెస్టు
  •  మచిలీపట్నం, న్యూస్‌లైన్ : అందరి సహకారంతో సాధారణ ఎన్నికలను జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించగలిగామని ఎస్పీ జె.ప్రభాకరరావు అన్నారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో గురువారం ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు, పోలీసులు, ప్రజలు సమన్వయంతో వ్యవహరించడంతో ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిశాయన్నారు.

    ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించిన వారిపై ప్రధానంగా పోలీసులు దృష్టి సారించారని చెప్పారు. నగదు పంపిణీ, మద్యం రవాణా తదితర అంశాలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. 2009లో శాంతిభద్రతలు అతిక్రమించిన వారిపై 46 కేసులు నమోదు కాగా 2014 ఎన్నికల్లో కేవలం ఐదు కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో చిన్న, చిన్న గొడవలు మినహా బాధితులు గాయాలపాలైన సంఘటనలు జరగలేదన్నారు.

    ఎన్నికలు ముగిసినప్పటికీ గ్రామాల్లో, పట్టణాల్లో పోలీసుల నిఘా ఉంటుందని ఎస్పీ తెలిపారు. 2009లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించిన వారిపై 49 కేసులు నమోదు చేయగా 2014 ఎన్నికల్లో 119 కేసులు నమోదు చేశామన్నారు. 2009 ఎన్నికల్లో రూ.1,03,85,160  నగదు సీజ్ చేయగా,  2014 ఎన్నికల్లో రూ.3,12,12,729ను సీజ్ చేశామని చెప్పారు. రూ. 46,86,877కు సక్రమంగా లెక్కలు చూపడంతో విడుదల చేశామని మిగిలిన నగదు కోర్టుకు అప్పగించామని తెలిపారు.

    మద్యం అక్రమ రవాణాపై 165 కేసులు నమోదు చేసి 190 మందిని అరెస్టు చేశామన్నారు. 34,996 మద్యం బాటిళ్లను సీజ్ చేశామని వీటి విలువ రూ. 24,49,720  ఉంటుందన్నారు. దొంగ సారా రవాణాపై 172 కేసులు నమోదు చేశామన్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు చీరలు, ఇతర గృహోపకరణాలు తదితరమైన వాటిని స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ రూ. 15 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు.
     
    ముందస్తుగా ఐదువేల మంది  బైండోవర్ ...

    సాధారణ ఎన్నికల్లో అల్లర్లు సృష్టించే వారిపై పూర్తిస్థాయి నిఘా ఉంచామన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్, జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అల్లర్లు సృష్టించిన వారిని వీడియోల ద్వారా గుర్తించామన్నారు. ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడుతున్న వారిని జిల్లా వ్యాప్తంగా 5వేల మందిని గుర్తించి వారిని బైండోవర్ చేశామని తెలిపారు. దీంతో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అవకాశం ఏర్పడిందన్నారు.

    తెలంగాణా ప్రాంతంలో ఎన్నికలు జరిగిన సమయంలో ఇక్కడ నుంచి విధులకు వెళ్లిన పోలీసులకు కనీస భోజన వసతి  కల్పించలేదన్నారు. ఇక్కడ ఎన్నికలు జరిగిన సమయంలో ఇతర ప్రాంతాల నుంచి ఎన్నికల విధుల కోసం వచ్చిన పోలీసులకు చక్కటి సౌకర్యాలు కల్పించామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 2,200 మంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు పోలీసులకు సహకారం అందించారన్నారు.

    కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు చొరవతో వలంటీర్ల సేవలను వినియోగించుకున్నామన్నారు. వీరందరికీ ప్రశంసాపత్రాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎన్నికల విధులకు జిల్లాలో 7,500 మంది పోలీసులు అవసరమయ్యారని తెలిపారు. 13 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించాయని చెప్పారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రంగా పోలింగ్ స్టేషన్ల నుంచి తరలించామని తెలిపారు.
     
    జీపీఎస్ సిస్టమ్ నిఘా ....


    గ్రామాల్లో, పట్టణాల్లో ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు ఈసారి జీపీఎస్ సిస్టమ్ ద్వారా ఎన్నికల సరళిని పరిశీలించామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో విధుల్లో ఉన్న పోలీసు అధికారులు ఎక్కడ ఉన్నదీ, ఎటునుంచి ఎటు ప్రయాణం చేస్తున్నారు తదితర అంశాలను వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్ల ద్వారా తెలుసుకున్నామన్నారు.

    ఏదైనా పోలింగ్ స్టేషన్‌లో గొడవ జరిగితే సమాచారం తెలుసుకున్న అధికారి అక్కడకు వెళ్లారా, లేదా అనే అంశంపైనా జీపీఎస్ పద్ధతి ద్వారా నిఘా ఉంచామన్నారు. ఈ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో జీపీఎస్ పద్ధతిని 384 ఫోన్లకు వర్తింపజేసి పోలీసుల కదలికలపై నిఘా ఉంచామని చెప్పారు.   12, 13 తేదీల్లో జరిగే మున్సిపల్, జెడ్‌పీటీసీ కౌంటింగ్ సందర్భంగా ప్రత్యేక బందోబస్తు  ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement