విధేయులకే కుర్చీ..!
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ వ్యవహార శైలిపై ఆది నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వర్సిటీలోని కీలక బాధ్యతలను తన విధేయులకే ఆయన అప్పగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఏడాది క్రితం.. ఒక్క సెమిస్టర్ కోసమంటూ ఆయన నియమించిన కోర్సు కోఆర్డినేటర్లు రెండో సెమిస్టర్‌కూ కొనసాగటం దీనికి బలం చేకూరుస్తోంది. వాస్తవానికి.. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న టీచింగ్ అసోసియేట్లను కోర్సు కోఆర్డినేటర్లుగా నియమించటం అప్పట్లో వివాదం రేపింది.
పూర్వ వీసీల నిరాకరణ
తమను కోర్సు కోఆర్డినేటర్లుగా నియమించాలని, మూల్యాంకనానికి అనుమతించాలని టీచింగ్ అసోసియేట్లు వర్సిటీ ఏర్పాటైనప్పటి నుంచి డిమాండ్ చేస్తూ వచ్చారు. లక్ష్య సాధన కోసం యూనియన్‌గా కూడా ఏర్పడ్డారు. వర్సిటీ తొలి వీసీ ప్రొఫెసర్ ఎస్వీ సుధాకర్, తర్వాత వచ్చిన ఇన్‌చార్జి వీసీలు ప్రొఫెసర్ వై.సత్యనారాయణ, ప్రొఫెసర్ ఆర్‌జీబీ భగవత్‌కుమార్‌లు ఇందుకు ఎంతమాత్రం అంగీకరించలేదు. వీసీగా లజపతిరాయ్ బాధ్యతలు చేపట్టాక సీన్ మారిపోయింది.
టీఏలను కోర్సు కోఆర్డినేటర్లుగా నియమించటమే కాక మూల్యాంకనకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందుకు ప్రతిగా టీచింగ్ అసోసియేట్లు యూనియన్‌ను రద్దు చేశారు. ఇక ఈ నెల 20 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో కూడా ప్రస్తుతమున్నవారినే కొనసాగిస్తారా? లేక రొటేషన్ పద్ధతిలో మిగిలిన టీఏలకు అవకాశం ఇస్తారా? అనేది వర్సిటీలో చర్చనీయాంశంగా మరింది.
అస్మదీయులకు ప్రాధాన్యం
కోర్సు కోఆర్డినేటర్ల నియామకంలో సీనియారిటీ, ప్రతిభ, నైపుణ్యాలకంటే అస్మదీయులకే వైస్‌చాన్సలర్ లజపతిరాయ్ పెద్దపీట వేశారన్న విమర్శలు వచ్చాయి. ఎంఈడీ, స్పెషల్ బీఎడ్ కోర్సుల సిలబస్, గుర్తింపు సంస్థలు వేర్వేరైనా ఈ రెండింటిని ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌గా నిర్ణయించి కోఆర్డినేటర్‌గా డాక్టర్ హనుమంతు సుబ్రమ్మణ్యంను నియమించారు. ఆయన గతంలో టీచింగ్ అసోసియేట్ల యూనియన్ అధ్యక్షునిగా పనిచేశారు. వర్సిటీ స్పెషల్ బీఎడ్(మెంటల్లీ రిటార్డ్) కోర్సు గుర్తింపు సంస్థ రీహేబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం వచ్చినపుడు ఈయనే చక్రం తిప్పారు.
ఈ బృందం వచ్చినట్లు రెక్టార్ స్థాయి అధికారికే తెలియదంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఎంఈడీ గుర్తింపు సంస్థ ఎన్‌సీటీఈ ప్రతినిధులు వచ్చినప్పుడు కూడా సుబ్రహ్మణ్యమే చక్రం తిప్పారు. అప్పటివరకు ఎవరో తెలియని ప్రభాకరరావు అనే వ్యక్తిని టీఏగా జాబితాలో పేర్కొని ఎన్‌సీటీఈ ప్రతినిధులను తప్పుదోవ పట్టించారు. ఎన్‌సీటీఈ బృందం వస్తున్నట్టు మిగిలిన టీఏలకు తెలియకపోవటం గమనార్హం. వర్సిటీ ఉన్నతాధికారి అండదండలతో ఈయన కొన్ని విభాగాల్లోని టీఏల నియామకం విషయంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఎంసీఏ విభాగంలో పనిచేస్తున్నవారిలో ఎంటెక్ గ్రాడ్యుయేట్ పొన్నాడ రామకృష్ణ సీనియర్. ఆయన పూర్వ వీసీ ఎస్వీ సుధాకర్ విధేయుడనే ముద్ర ఉంది. దీంతో రోణంకి శ్రీధర్‌ను కోర్సు కోఆర్డినేటర్‌గా నియమించినట్టు సమాచారం. -న్యాయ విభాగంలో చాలామంది సీనియర్లు ఉన్నప్పటికీ ఆంధ్రా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్(గతంలో ఇక్కడి పీజీ సెంటర్‌లో పనిచేశారు) సుబ్రహ్మణ్యం భార్య డాక్టర్ ఎం.సరోజనమ్మను కోర్సు కోఆర్డినేటర్‌గా నియమించారు.
ఎంఎల్‌ఐఎస్సీ కోర్సు కోఆర్డినేటర్‌గా గతంలో విశ్రాంత ప్రొఫెసర్ పిల్లల భాస్కరరావు వ్యవహరించేవారు. ఆయన స్థానంలో డాక్టర్ ఎన్.గోవిందరాజులును నియమించారు. టీఏల యూనియన్ ప్రధాన కార్యదర్శి కావటం వల్లే ఆయనకు అవకాశం ఇచ్చారు.-గణిత విభాగం కోర్సు కోఆర్డినేటర్‌గా నియమించిన రవికి షోర్‌ను మాత్రం బాధ్యతల నుంచి తప్పించారు. సీనియారిటీ లేకున్నా డాక్టరేట్ ఉందంటూ కొత్తగా చేరిన ఎం.కిరణ్‌కుమార్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. డాక్టరేట్ ప్రామాణికం అనుకుంటే ఎంసీఏలో ఏఒక్క బోధకునికీ డాక్టరేట్ లేదు. అక్కడ మాత్రం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.
ఇంగ్లిష్ కోర్సు కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న డాక్టర్ కుప్పిలి హరికిషన్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయగా ఆయన స్థానంలో డాక్టర్ బి.వి.రమణమూర్తికి బాధ్యతలు అప్పగించారు. వ్యక్తిత్వ వికాస తరగతులు చెప్పేందుకు వర్సిటీలో చేరిన రమణమూర్తి అనంతరం ఇంగ్లిష్ విభాగంలో చేరారు. వర్సిటీ ఉన్నతాధికారికి విధేయుడు కావటంతో కోర్సు కోఆర్డినేటర్‌గా నియమితులై పెత్తనం చెలాయించటం మొదలుపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. రెగ్యులర్ బోధకులను సైతం పక్కనబెట్టి ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తుండటం గమనార్హం.ఈ పరిణామాలను రెగ్యులర్ బోధకులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. కొత్త విద్యా సంవత్సరంలో కూడా వీరినే కోర్సు కోఆర్డనేటర్లుగా కొనసాగిస్తే వర్సిటీలో బోధన నిర్వీర్యమైపోతుందని అంటున్నారు. దీనిపై వైస్‌చాన్సలర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి.
త్వరలో మార్పులు చేస్తాం..
ఈ విషయమై రిజిస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్‌ను న్యూస్‌లైన్ ప్రశ్నించగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక మార్పులు చేస్తామని చెప్పారు. ప్రతిభగల టీఏలు ఉంటే తప్పనిసరిగా అవకాశం ఇస్తామన్నారు. గత రెండు సెమిస్టర్లలో కోర్సు కోఆర్డినేటర్లు కనబరిచిన ప్రతిభను కూడా పరిశీలిస్తామన్నారు. కొత్త టీచింగ్ అసోసియేట్ల నియామకం కూడా చేపడతామని తెలిపారు.