రోజా రాజా | today rose day | Sakshi
Sakshi News home page

రోజా రాజా

Published Mon, Sep 22 2014 2:53 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

రోజా రాజా - Sakshi

రోజా రాజా

శ్రీకాకుళం కల్చరల్:అలసిన మనసుకు ఉల్లాసం, వ్యాధి గ్రస్తుల్లో స్వస్థత, మగువల్లో ఉత్సాహాన్ని నింపేవి పువ్వులే. పూలన్నింటిలోకి రారాజుగా రోజాపువ్వు పేరు పొందింది. దీనిని ఇష్టపడని మగువ ఉండదు. ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రియుడుకి రోజా పువ్వు ఒక మంచి సాధనం. చారడేసి కళ్లతో అరవిరసిన గులాబీ పువ్వు అందానికి ప్రియురాలు దాసోహం కావాల్సిందే. కవులు కవిత్వాలు రాయూల్సిందే. అందుకే రోజా పువ్వుకు ఓ ప్రత్యేకమైన రోజును కేటయించారు.
 
 గులాబీల రోజు ఇలా..
 క్యాన్సర్ రోగులు త్వరగా కోలుకోవాలని కోరుతూ కెనడాలో మొదటిసారిగా సెప్టెంబర్ 22న గులాబీ పూలను అందజేశారు. రోగుల్లో స్వస్థత చేకూరేందుకు సాధనంగా వినియోగించేవారు. అది క్రమేపీ అన్ని దేశాలకు పాకింది. దీంతో ఏటా సెప్టెంబర్ 22న గులాబీ దినోత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది. చరిత్ర, సాహిత్యం, కవిత్వం, సంగీతం ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ప్రక్రియలోనైనా గులాబీదే  అగ్రస్థానం. 35 మిలియన్ సంవత్సరాల కిందటే పుట్టిన రోజా సౌందర్యానికి, సౌకుమార్యానికి సన్నితమైన దర్పణంగా గులాబీ నిలుస్తోంది.
 
 సాహిత్యంలో ప్రత్యేకం...
 గులాబీలకు సంస్కృతి, సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. గులాబీలను శమంతిక, అతి మంజుల, తరుణి తదితర పేర్లతో పూర్వం పిలిచే వారు. ఈజిప్టు రాణి క్లియోపాత్ర కాలం నుంచి ప్రేమకు చిహ్నంగా గులాబీలను వాడుతున్నారు. తన ప్రియుడైన ఆంధోనిని స్వాగతించేందుకు మోకాళ్ల ఎత్తు మేర గులాబీ రేకుల్ని పరిచిందట క్లియోపాత్ర.
 
 ఆధునికంలో ఎన్నో రంగులు
 పెరుగుతున్న టెక్నాలజీతో గులాబీలలో కూడా రంగులు పెరుగుతున్నాయి. పర్యాటకులను ఆకర్షించేందుకు గులాబీల తోటలను పెద్ద ఎత్తున సాగుచేస్తున్నారు. బెంగుళూరు, ఊటీ తదితర ప్రాంతాల్లోని ‘రోజ్ గార్డెన్’లకు ఎంతో పేరు ఉంది. అక్కడ సేదతీరేందుకు పర్యాకులు చాలా ఇష్టపడతారు.
 
 ఎన్నో ప్రయోజనాలు
 వైద్యపరంగా గులాబీకి చాలా ప్రాముఖ్యం ఉంది. పంచధార, గులాబీ రేకులు కలిపి చేసిన గుల్‌ఖండ్ మంచి విరోచన కారిగా పనిచేస్తుంది. గులాబీ పూసి, వాడి రాలిపోయిన పిదప చిన్న బుడిపెలా మిగిలిపపోయే కాయల్లో(హిప్‌లు) నిమ్మ, నారింజ కంటే కనీసం పదిరెట్లు ఎక్కువ ‘విటమిన్ సి’ ఉంటుంది. ముఖాన్ని కాంతివంతంగా చేస్తూ మచ్చల్ని తొలగించేందుకు గులాబీ వాడుతున్నారు. గులాబీ రేకులతో టీ చేసుకుని తాగితే జలుబుకు ఉపశమనం లభిస్తుంది. గులాబీ తైలం మర్దన చేయించుకుంటే మనోల్లాసం చేకూరుతుంది. గులాబీలను సౌందర్య సాధనాలుగా కూడా వాడుతుంటారు. శరీరాన్ని మృదువుగా, తేమగా ఉంచుంది. వీటితో పేస్‌ప్యాక్ తయారుచేస్తున్నారు. గులాబీ రేకుల క్రీమ్‌తో మసాజ్ చేస్తున్నారు. గులాబీ రేకుల్ని వేడి నీటిలోనాలుగు గంటలు ఉంచి, వాటితో స్నానం చేస్తే మెరుపు, మృదుత్వం వస్తుంది.
 
 సంఖ్యకో సంకేతం
 గులాబీల సంఖ్యను బట్టి కొన్ని భావాలకు సంకేతాలుగా మారారుు. 12 గులాబీల గుచ్చం కృతజ్ఞత తెలిపేందుకు, 25 గులాబీలతో కూడిన గుచ్చం శుభాకాంక్షలు చెప్పేందుకు, 50 గులాబీలతో కూడిన గుచ్చం గాఢమైన, పరిపూర్ణమైన ప్రేమను వ్యక్తం చేసేందుకు సంకేతాలుగా భావిస్తారు.
 
 రంగుకో అర్ధం
 ఎరుపు : నిజమైన  ప్రేమ
 పసుపు : ఆనందం, స్నేహం, సంతోషం, జ్ఞాపకం, అసూయ
 గులాబీ : ఆనందం, దయ, నమ్మకం
 తెలుపు : స్వచ్ఛత, పవిత్రత  
 ముదురుగులాబీ : కృతజ్ఞత
 నారింజ : ఉత్సుకత, ఊహ
 ఎరుపు-పసుపు మిశ్రమం : సంతోషం
 ముధుర గోధుమ-ఎరుపు : ఆనందం
 ఎరుపు-తెలుపు : ఐకమత్యం
 లేత పసుపుపచ్చ : కోరిక
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement