పూతలపట్టు (చిత్తూరు): రెప్పపాటులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగం, పైగా ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ కునుకుపాటు గురవడంతో వోక్స్‌వ్యాగన్ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొంది. ఈ దెబ్బకు అది బోల్తా పడి అదే మార్గంలో వోక్స్ వ్యాగన్ కారు వెనుక వస్తున్న ఇండిగో పైకి దూసుకెళ్లింది. తర్వాత రోడ్డు పక్కన ఉన్న బోరు స్టాటర్ గదిని ఢీకొంది. ఈ ప్రమాదంలో వోక్స్‌వ్యాగన్ కారు నడుపుతున్న వ్యక్తి, ఇండిగో కారులోని మరో వ్యక్తి మృత్యువాత పడ్డారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన చిత్తూరు– తిరుపతి జాతీయ రహదారిలోని ఒంటిల్లు వద్ద శనివారం తెల్లవారుజూమున 4.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరుకు చెందిన సురేష్‌రెడ్డి(47), భార్య అనిత(41), చిన్న కూతురు యతినశ్రీ(21)తో వోక్స్‌వ్యాగన్ కారులో బెంగళూరులోని పెద్దకూతురు ఇంటికెళ్లి తిరిగి గుంటూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున పూతలపట్టు సమీపంలోని ఒంటిళ్లు వద్ద ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి, తిరుపతి నుంచి వస్తున్న కంటైనర్ లారీని ఢీకొన్నాడు. దీంతో అది బోల్తాపడి.. రోడ్డుపై రాజుకుంటూ అదే సమయంలో ఇటు వైపుగా వస్తున్న ఇండికా కారును ఢీకొంది. అందులో కర్ణాటక తుమ్ముకూరుకు చెందిన శివరాజు(35), బసవరాజు(40), త్రిభవన(25) తిరుమలకు వెళుతున్నారు.
ఈ ప్రమాదంలో వోక్స్ వ్యాగన్ కారు నడుపుతున్న సురేష్ రెడ్డి, ఇండికా కారులోని శివరాజ్ చనిపోయారు. అనిత, యతినశ్రీ, బసవరాజు, త్రిభవన తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద శబ్దం రావడంతో చుట్టు పక్కల గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే 108కు సమాచారం అందించారు. ఆ ప్రాంతమంతా చీకటిగా ఉండడంతో క్షతగాత్రులను వాహనాల్లో నుంచి తీసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. వెంటనే హైవే పెట్రోల్ వాహనం అక్కడి చేరుకోవడంతో పోలీసులు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తరువాత 108 వాహనంలో యతినశ్రీ, అనితను మొదట చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, తర్వాత మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. జాతీయ రహదారిపై బోల్తాపడిన కంటైనర్‌ను తొలగించి పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం ఘటన స్థలాన్ని పాకాల సీఐ రామలింగయ్య పరిశీలించారు. ఈ మేరకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment