సుడులు తిరుగుతూ.. అలజడి రేపుతూ
ఈ గడ్డ సౌభాగ్యానికి దన్నుగా నిలిచే ఆ ప్రవాహమే ఇప్పుడు.. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇక్కడి మట్టిని సిరులకు ఆటపట్టుగా మార్చే జీవనదే.. ఒక్కసారిగా ఉగ్రరూపిణిగా మారి ఇళ్లను, పొలాలను కబళిస్తోంది. కడుపులో చల్ల కదలకుండా సాగే బతుకులను కలవరపరుస్తోంది. ఉన్న ఊరినీ, తలదాచుకున్న ఇంటినీ వదిలి, ‘బతుకుజీవుడా!’ అంటూ సురక్షిత ప్రాంతాలకు పరుగు తీసేలా చేస్తోంది.
అమలాపురం :
గోదావరి తన ఉగ్రరూపాన్ని చూపుతోంది. సుడు లు తిరిగి ప్రవహిస్తూ జనం గుండెల్లో గుబులు రేపుతోంది. లంకవాసులు భయం గుప్పెట్లో గజగజ వణికిపోతున్నారు. ఎగువ ప్రాంతాల్లో వరద నెమ్మదిస్తున్నా.. దిగువన ప్రతాపాన్ని చూపుతోంది. మంగళవారం వరద ఉధృతి మరింత పెరగడంతో జిల్లాలో పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుని బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు, రోడ్లు, పొలాల్లోకి నీరు చేరింది. రాకపోకలు నిలిచిపోవడంతో లంకవాసులు నానా కష్టాలు పడుతున్నారు. సోమవారం కన్నా మంగళవారం వరద తాకిడి మరింత ఎక్కువైంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద నీటిమట్టం సాయంత్రం ఆరు గంటలకు 16.10 అడుగులకు చేరుకోగా, 16.51 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువన దుమ్ముగూడెం, భద్రాచలంల వద్ద వరద తగ్గుముఖం పడుతున్నా బ్యారేజి వద్ద నీటిమట్టం మరింత పెరిగి, దిగువకు విడిచే నీటి పరిమాణం మరింత పెరగడంతో ఆ ప్రభావం లంక గ్రామాలపై పడింది. వరదతోపాటు పౌర్ణమి వల్ల సముద్ర పోటెత్తుతుండడంతో కోనసీమలోని లంక గ్రామాల్లో ముంపు తీవ్రత పెరుగుతోంది.
మునిగిన కాజ్‌వేలు, రోడ్లు జిల్లాలో కొత్తగా చేరిన కూనవరం, చింతూరు మండలాల్లోని లోతట్టు ప్రాంతాలతోపాటు మరో 15 మండలాల్లోని 75 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదనీట చిక్కిన గ్రామాల్లో ఐదారడుగుల లోతున నీరు చేరడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. దేవీపట్నం మండలంలో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయినవిల్లి, పి.గన్నవరం, ముమ్మిడివరం, అల్లవరం, మామిడికుదురు మండలాల్లోని లంక గ్రామాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ గ్రామాలకు వెళ్లే కాజ్‌వేలు, రహదారులు ఐదారడుగుల లోతున నీట మునగడంతో పాటు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో స్థానికులు తప్పనిసరి అయితే బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. పాశర్లపూడి, వీరవల్లిపాలెం కాజ్‌వేలు నీట మునగడంతో వీరవల్లిపాలెం, అద్దింకివారిలంక, వీరవల్లిపాలెంలంక, అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నలంక గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వీరవల్లిపాలెం కాజ్‌వేపై పడవలు ఏర్పాటు చేయగా పాశర్లపూడి కాజ్‌వే వద్ద ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులు పడరాని పాట్లు పడుతున్నారు. పుదుచ్చేరి పరిధిలోని యానాంలో ఫెర్రీలోకి నీరు చేరింది. కె.వి.నగర్‌లో వంద ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలుచోట్ల వరదలకు కొట్టుకు వస్తున్న విషసర్పాలను చూసి జనం ఆందోళన చెందుతున్నారు. పి.గన్నవరం మండలాన్ని అనుకుని ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నాలుగు గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయింది.
పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లికి చెందిన చింతా కృష్ణమూర్తి (45) అనే వ్యవసాయ కూలీ వరద నీటిలో గల్లంతయ్యాడు. కూలి పని నిమిత్తం ఉదయం లంకలోకి వెళ్లిన కృష్ణమూర్తి సాయంత్రం ఆరు గంటల సమయంలో తిరిగి వస్తుండగా అప్పటికే లంక నుంచి వచ్చే రహదారిని ముంచెత్తిన వరద నీటిలో అదుపు తప్పి కొట్టుకుపోయాడు. అక్కడున్న వారు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కృష్ణమూర్తి ఆచూకీ కోసం పడవలపై గాలిస్తున్నారు. అతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కృష్ణమూర్తి భార్య కృష్ణవేణిని జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, అమలాపురం ఇన్‌చార్జి ఆర్డీఓ టీవీఎస్‌జీ కుమార్ మంగళవారం రాత్రి పరామర్శించి, ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాగా పశువులను మేపడానికి వెళ్లి వరదనీట చిక్కుకున్న అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంకు చెందిన ఏడుగురు రైతులను సురక్షితంగా గ్రామానికి చేర్చారు. సోమవారం గాజుల్లంకలో చిక్కుకున్న వారిని రెవెన్యూ అధికారులు అర్ధరాత్రి పడవలపై గ్రామానికి తీసుకువచ్చారు.
రైతుల యాతనలు లంక గ్రామాల్లో సాగవుతున్న వాణిజ్య, కూరగాయ పంటలు వరద నీట మునిగాయి. సుమారు 60 వేల ఎకరాల్లో పంట నీట మునిగినట్టు అంచనా. మరో రెండు, మూడు రోజులు లంక తోటలు, పొలాల్లో వరద నీరు ఉండే అవకాశమున్నందున తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముందని లంక రైతులు ఆందోళన చెందుతున్నారు. కొబ్బరి రాశులు వరదకు కొట్టుకుపోకుండా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రాశులను ఇళ్ల మీదకు చేర్చుకునే పనిలో పడ్డారు. పాడి రైతులు సైతం ఇక్కట్ల పాలవుతున్నారు. ముందు జాగ్రత్తగా పశువులను, పశుగ్రాసాలను ఏటిగట్లపైకి, మెరక ప్రాంతాలకు తరలించారు.
పలు గ్రామాల్లో వరద నీరు ఇళ్లలోకి సైతం చొరబడడంతో స్థానికులు సామగ్రిని తరలించుకుంటున్నారు. పునరావాస కేంద్రాలకు తరలి వస్తున్నారు. కొంతమంది మాత్రం తమ ఆస్తులకు రక్షణగా ఇళ్ల వద్దే ఉండిపోతున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో 591 మంది తలదాచుకుంటున్నారు. దేవీపట్నం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో తొయ్యేరుకు చెందిన 75 మందికి ఆశ్రయం కల్పించారు. రాజమండ్రిలో 203 మందికి పునరావాసం కల్పించినట్టు కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముంపుబారిన పడిన అల్లవరం మండలం బోడసకుర్రులో పర్యటించారు. కలెక్టర్ నీతూప్రసాద్ పి.గన్నవరం మండలం జి.పెదపూడి, ఊడిమూడిల్లో ఏటిగట్లను, కోడేరులంకలో నదీ కోత ప్రాంతాన్ని పరిశీలించారు. వరద పరిస్థితిపై స్థానికంగా సమీక్షించారు.