ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన సందర్భంగా ప్రజావ్యతిరేకత కనిపించకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులను ముందస్తు అరెస్ట్‌లు, గృహ నిర్బంధాలు చేశారు. రెండురోజులుగా అప్రజాస్వామికంగా అరెస్టులు చేస్తుండడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు
అనంతపురం సెంట్రల్: అనంతపురంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ఇంటి వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేయాలని బయల్దేరిన ఎమ్మెల్సీ తనయుడు, వైఎస్సార్‌సీపీ రాప్తాడు జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రారెడ్డిని అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు నల్లబ్యాడ్జిలతో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. వెన్నపూస రవీంద్రారెడ్డి మాట్లాడుతూ మహాత్మగాంధీ ఉపాధిహామీ పథకంలో రూ.500 కోట్లకు పైగా అవినీతి జరిగిందని తెలిపారు. అవినీతి లేకుండా చేస్తానని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు గురివింద గింజ సామెతను గుర్తుకు తెస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు, అవినీతి గురించి ప్రశ్నిస్తే అరెస్ట్‌లు చేస్తారా అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేక నిరంకుశ పాలనలో ఉన్నామా అని నిలదీశారు.
చింతకుంట మధు గృహ నిర్బంధం:
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి చింతకుంట మధును శుక్రవారం అర్దరాత్రి నుంచే గృహం నిర్బంధం చేశారు. మారుతీనగర్‌లోని ఆయన నివాసానికి నాల్గవ పట్టణ ఎస్‌ఐ అల్లాబకాష్, పోలీసు సిబ్బంది చేరుకున్నారు. గృహ నిర్బంధం చేయడంపై చింతకుంట మధు మండిపడ్డారు. మేమేమైనా ఉగ్రవాదులమా.? టెర్రరిస్టులమా అని ప్రశ్నించారు.
పలువురు నేతల అరెస్ట్
సీఎం పర్యటన సందర్భంగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేసి టూటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, విద్యార్థి విభాగం అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు రాజేష్, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్‌యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పురుషోత్తం, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జేఎం బాషా, రైతు విభాగం జిల్లా కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి వలిపిరెడ్డి శివారెడ్డి, గోగుల పుల్లయ్య, వెంకటేశ్వరరెడ్డి, రాంప్రసాద్, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, నాయకులు మునీరా, భారతి తదితరులను వేర్వేరు చోట్ల అరెస్ట్ చేసి టూటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాసమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోవాలనుకున్న ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య అని అన్నారు.
నాయకుల పరామర్శ
అక్రమ అరెస్టులను వైఎస్సార్‌సీపీ నాయకులు ఖండించారు. టూటౌన్ పోలీసుస్టేషన్‌లో నిర్బం ధించిన కార్యకర్తలను ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వై.వి శివారెడ్డిలు పరామర్శించారు. పోలీసుల తీరును తప్పుపట్టారు. ప్రజాస్వామ్య దేశంలో భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా టీడీపీ ప్రభుత్వం చూస్తుండడం బాధాకరమన్నారు. ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడేందుకు పోలీసులను అడ్డుపెట్టుకొని అరెస్ట్‌లు చేయిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
అక్రమ అరెస్టులు దారుణం
అనంతపురం సప్తగిరి సర్కిల్: సీఎం పర్యటన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం దారుణమని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నారాయణరెడి తెలిపారు. ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటన సందర్భంగా వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు శంకరనారాయణ, రాప్తాడు జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులను అరెస్టు, హౌస్ అరెస్టులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. పోలీసుల పహారాతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ నాయకుల అక్రమ అరెస్టులకు కారణమైన కలెక్టర్, ఎస్పీలపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment