ఫోర్బ్స్ జాబితాలో 30 మంది ప్రవాస భారతీయులు
న్యూయార్క్: ఫోర్బ్స్ సూపర్ అచీవర్స్ జాబితా 2017 ఎడిషన్‌లో తాజాగా భారతీయ సంతతికి చెందిన 30 మంది స్థానం దక్కించుకున్నారు. కొత్త ఆవిష్కరణలతో వీరు వారి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికారని ఫోర్బ్స్ పేర్కొంది. ప్రపంచ పరివర్తనలో తమ వంతు కృషి చేసిన 30 ఏళ్ల వయసులోపు వారికి జాబితాలో చోటు కల్పించామని తెలిపింది. ఈ జాబితాలో నియోలైట్ సహ వ్యవస్థాపకుడు వివేక్ కొప్పర్తి, జిప్‌లైన్‌కు చెందిన ప్రార్థన దేశాయ్, ఆర్థోనింజా వ్యవస్థాపకుడు షాన్ పటేల్, అవేరియా హెల్త్ సొల్యూషన్స్‌ను స్థాపించిన రోహణ్ సూరి వంటి వారు స్థానం పొందారు.
లా అండ్ పాలసీ విభాగంలో వరుణ్ శివరామ్, తయారీ రంగంలో నేహా గుప్తా, సోషియల్ ఎంట్రప్రెన్యూర్స్ విభాగంలో కిసాన్ నెట్‌వర్క్ సహ వ్యవస్థాపకుడు ఆదిత్య అగర్వాల్, స్పోర్ట్స్ కేటగిరిలో ఫిలడెల్‌ఫియా 76 ఈఆర్‌ఎస్ టీమ్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ అక్షయ్ ఖన్నా జాబితాలో ఉన్నారు. ఇక వెంచర్ క్యాపిటల్ రంగంలో అనర్గ్య వర్ధన, అక్షయ్ గోయల్, కన్సూమర్ టెక్నాలజీ విభాగంలో రూమి వ్యవస్థాపకుడు అజయ్ యాదవ్ వంటి వారు జాబితాలో స్థానం పొందారు. కాగా జాబితాలో మొత్తంగా 600 మంది స్థానం దక్కించుకున్నారు.