ముంబై: హురుణ్ ఇండియా సంపన్నుల జాబితా–2017లో ఆర్‌ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈయన టాప్ స్థానాన్ని దక్కించుకోవడం ఇది వరుసగా ఆరోసారి. అలాగే హురుణ్ గ్లోబల్ జాబితాలో అంబానీ ఏకంగా తొలిసారి టాప్– 15లోకి చేరారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) షేర్లు మార్కెట్లో ర్యాలీ జరపడం వల్ల అంబానీ సంపద 58 శాతం వృద్ధితో రూ.2,57,900 కోట్లకు చేరింది. అంబానీ సంపద తను జన్మించిన యెమెన్ దేశపు జీడీపీ కన్నా 50% ఎక్కువ కావడం గమనార్హం!!.
ఇక పతంజలి సీఈవో బాలకృష్ణ సంపద 173% వృద్ధితో రూ.70,000 కోట్లకు చేరింది.దీంతో ఈయన టాప్–10లోకి ఎంట్రీ ఇచ్చి 8వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. గతేడాది ఈయన 25వ స్థానంలో ఉన్నారు.ఈ జాబితాలో తొలితరం పారిశ్రామికవేత్తలుగా రాణించి, స్వశక్తితో బిలియనీర్లుగా ఎదిగిన వారిలో మీడియా.నెట్ హెడ్ దివ్యాంక్ తురాఖియా (34 ఏళ్లు), బెంగళూరుకు చెందిన 42 ఏళ్ల అంబిగ సుబ్రమణియన్ స్థానం దక్కించుకున్నారు. అంబిగ.. మ్యు–సిగ్మా సహ వ్యవస్థాపకురాలు.
ఈ ఏడాది జాబితాలో మొత్తంగా 51 మంది మహిళలు స్థానం పొందారు. జాబితాలో మ్యాన్‌కైండ్ ఫార్మాకు చెందిన ఏక్‌లవ్య జునేజా చాలా పిన్న వయస్కుడిగా నిలిచారు. ఈయనకు కంపెనీలో 12 శాతం వాటా ఉంది. ధనిక రియల్ ఎస్టేట్ బిలియనీర్‌గా డీఎల్‌ఎఫ్‌కు చెందిన కుశాల్ పాల్ సింగ్ ఉన్నారు. ఈయన సంపద రూ.27,400 కోట్లుగా ఉంది. లోధా గ్రూప్‌నకు చెందిన మంగల్ ప్రభాత్ లోధా.. సంపన్న ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా ఉన్నారు. ఈయన సంపద రూ.15,700 కోట్లుగా ఉంది. కాగా జాబితాలోకి కొత్తగా 26 మంది ఎంట్రీ ఇచ్చారు.
దమాని సంపద 320 శాతం అప్
జాబితాలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డి–మార్ట్) ఫౌండర్ చైర్మన్ రాధాకృష్ణ దమాని సంపదలో గరిష్టంగా 320 శాతం వృద్ధి నమోదయ్యింది. దీనికి అవెన్యూ సూపర్‌మార్కెట్స్ లిస్టింగ్ ప్రధాన కారణం. దమాని తర్వాతి స్థానంలో ఎండ్యూరెన్స్ టెక్ ఎండీ అనురాగ్ జైన్ ఉన్నారు. ఈయన సంపదలో 286 శాతం వృద్ధి కనిపించింది. జూలై 31 నాటి డాలర్ విలువ 64.1 ఆధారంగా సంపద పెరుగుదలను పరిగణనలోకి తీసుకున్నారు.
ముంబైలోనే ఎక్కువ..: ముంబైలో 182 మంది సంపన్నులు ఉన్నారు. తర్వాతి స్థానంలో న్యూఢిల్లీ (117), బెంగళూరు (51) ఉన్నాయి. 26 మందితో అహ్మదాబాద్ నగరం కూడా ఈ సారి టాప్–5లో స్థానం దక్కించుకుంది. చెన్నై (22), కాన్పూర్ (11) తొలిసారి టాప్–10లోకి వచ్చాయి. జాబితాలో కొత్తగా 18 ప్రాంతాలు వచ్చాయి. ఉదయ్‌పూర్‌లో ముగ్గురు, వడోదరలో ఇద్దరు ఉన్నారు. కాంచీపురం, ఫరీదాబాద్‌లో ఒకరు చొప్పున ఉన్నారు.