న్యూఢిల్లీ: విజయ్ మాల్యా నుంచి బకాయిలను సాధ్యమైనంతగా రాబట్టుకునేందుకు బ్యాంకులు బ్రిటన్‌తోపాటు పలు దేశాల్లోని ఏజెన్సీలతో కలసి కృషి చేస్తున్నాయని ఎస్‌బీఐ ఎండీ అరిజిత్ బసు చెప్పారు. బ్రిటన్ హైకోర్టు లండన్ సమీపంలోని మాల్యా నివాసాల్లో సోదాలు, జప్తులకు అనుమతించిన విషయం తెలిసిందే.
దీనిపై బసు మాట్లాడుతూ... ‘‘ప్రభుత్వంతోపాటు అన్ని రకాల ఏజెన్సీలు కలసి సమన్వయంతో చేసిన ప్రయత్నాల వల్లే ఇది సాధ్యమైంది. తీర్పు పట్ల సంతోషంతో ఉన్నాం. ఈ తీర్పు సాయంతో ఆస్తులను స్వాధీనం చేసుకోగలం’’ అని చెప్పారు. 13 బ్యాంకులకు మాల్యా రూ.9,000 కోట్ల బకాయి ఉండగా, ఎస్‌బీఐ లీడ్ బ్యాంకుగా వ్యవహరిస్తోంది. తాము చేసిన కృషి వల్లే ప్రపంచవ్యాప్తంగా ఆస్తుల జప్తునకు ఆదేశాలు పొందామన్నారు. ఈ ఆస్తుల విలువ రుణ బకాయిలతో పోలిస్తే గణనీయంగానే ఉంటుందని, పూర్తిగా మాత్రం కాదని తెలిపారు.
ఆస్తుల వేలం ఎప్పటిలోపు అన్న ప్రశ్నకు అన్ని ఏజెన్సీలతో కలసి బ్యాంకులు పనిచేస్తున్నాయని బసు చెప్పారు. విజయ్ మాల్యాకు చెందిన స్వదేశీ ఆస్తుల ద్వారా రూ.963 కోట్లను రికవరీ చేసుకున్నట్టు వెల్లడించారు. గడిచిన రెండు మూడేళ్ల కాలంలో బ్యాంకులు చాలా శ్రమించడం వల్లే ఆస్తుల రికవరీకి ఆదేశాలు వచ్చాయని, వీటిలో చాలా వరకు ఆస్తులు విదేశాల్లోనే ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే, బ్రిటన్ హైకోర్టు ఆదేశాలపై అప్పీలుకు అనుమతించాలని మాల్యా పెట్టుకున్న దరఖాస్తు ఇంకా న్యాయస్థానం పరిశీలనలోనే ఉన్న విషయం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment