బడ్జెట్‌పైనే మార్కెట్ దృష్టి
న్యూఢిల్లీ: ఈ ఏడాది అతి పెద్ద ఆర్థిక అంశమైన బడ్జెట్‌పైనే ఇన్వెస్టర్ల దృష్టి వుంది. నేడు(సోమవారం) ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రానున్న రోజుల్లో మన స్టాక్ మార్కెట్ గమనం ఎలా ఉండబోతుందో బడ్జెట్ తేలుస్తుందని నిపుణులంటున్నారు. బడ్జెట్‌తో పాటు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పోకడలు, విదేశీ ఇన్వెస్టర్ల ఇన్వెస్ట్‌మెంట్స్, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, ముడి చమురు ధరల గమనం.. ఈ అంశాలు కూడా తగినంత ప్రభావం చూపుతాయని వారంటున్నారు. ఫిబ్రవరి నెల వాహన గణాంకాల వివరాలను వెల్లడిస్తున్నందున వాహన కంపెనీల షేర్లు వెలుగులోకి రావచ్చు. ఇక ఈ వారంలో వెలువడే సేవలు, తయారీ రంగానికి సంబంధించి పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు కూడా తగిన ప్రభావం చూపించొచ్చు.
మళ్లీ మెరుపులు....
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7-7.75% వృద్ధి సాధ్యమని ఆర్థిక సర్వే వెల్లడించడం సానుకూలాంశమని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ఈ బడ్జెట్‌తో స్టాక్ మార్కెట్‌లో మళ్లీ మెరుపులు వస్తాయని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గడియా చెప్పారు. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ జోరును పెంచే చర్యలను ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం తీసుకుంటుందనిఆశిస్తున్నారని, అందువల్ల ఇన్వెస్టర్లు, ట్రేడర్లు బడ్జెట్ ప్రతిపాదనలకు తక్షణం, తీవ్రంగా స్పందిస్తారని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు.
మూలధన లాభాల పన్ను పోటు ?
అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లన్నీ అతలాకుతలమవుతున్నాయని, రూపాయి మారకం విలువ కదలికలు ఒడిదుడుకులమయంగా వుందని, ముడి చమురు ధరలు కనిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నాయని, ఇలాంటి నేపథ్యంలో బడ్జెట్ వస్తోందని బొనాంజా పోర్ట్‌ఫోలియో హెడ్(వెల్త్ మేనేజ్‌మెంట్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్) అచిన్ గోయల్ చెప్పారు. మూలధన లాభాల పన్నుకు సంబంధించి ఈక్విటీలకు ప్రతికూలమైన నిర్ణయం రావచ్చన్న ఆందోళన నెలకొన్నదని ఆయన పేర్కొన్నారు.
ఇక గత వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 555 పాయింట్లు(2.34 శాతం) నష్టపోయి 23,154 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 181 పాయింట్లు (2.51 శాతం)నష్టపోయి 7,030 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ నెలలో బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇప్పటివకూ 1,716 పాయింట్లు లేదా 7 శాతం మేర నష్టపోయింది.
విక్రయాల బాటలోనే విదేశీ ఇన్వెస్టర్లు
విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటివరకూ రూ.11,350 కోట్ల పెట్టుబడులను క్యాపిటల్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. ముడి చమురు ధరల పతనం, అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు ముసురుకోవడం, రూపాయి క్షీణత దీనికి ప్రధాన కారణాలు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్న పెట్టుబడుల మొత్తం రూ.20,177(300 కోట్ల డాలర్లు) కోట్లుగా ఉంది.
డిపాజిటరీలు వెల్లడించిన గణాంకాల ప్రకారం.., ఈ నెల 26 వరకూ ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.4,937 కోట్లు, డెట్ మార్కెట్ల నుంచి రూ.6,425 కోట్ల చొప్పున మొత్తం రూ.11,362 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఇక విదేశీ ఇన్వెస్టర్లు జనవరిలో ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.13,381 కోట్లు ఉపసంహరించుకోగా డెట్ మార్కెట్లో రూ.3,274 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.
బడ్జెట్ తర్వాత ర్యాలీ..!
ద్రవ్యలోటు, సబ్సిడీలు, పన్నుల విషయాల్లో బడ్జెట్ సంతృప్తికరంగా ఉండి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధిక కేటాయింపులు, కార్పొరేట్ పన్నుల హేతుబద్ధీకరణ, సంస్కరణలకు సంబంధించి స్పష్టమైన విధానాలను బడ్జెట్ ప్రకటిస్తే, స్టాక్ మార్కెట్లో పెద్ద ర్యాలీ వస్తుందని విశ్లేషకులంటున్నారు.