దివాలా బిల్లుకు స్టాండింగ్ కమిటీ ఓకే
♦ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ
♦ ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే చర్చ
న్యూఢిల్లీ: దివాలా బిల్లుకు పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆమోదముద్ర వేసినట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలిపారు. మొండిబకాయిల (ఎన్‌పీఏ)లపై జరిగిన ఒక సమావేశంలో బుధవారం నాడు ఆయన మాట్లాడుతూ, ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం తగిన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రుణ ఎగవేతదారులపైనే కాకుండా గ్యారెంటార్లపై సైతం సర్‌ఫేసీ చట్టం ప్రకారం తగిన చర్యలను తీసుకోవలసినదిగా బ్యాంకులకు సూచించడం జరిగిందని జైట్లీ తెలిపారు.
రుణ డిఫాల్టర్లు రెండు రకాలుగా ఉన్నారని పేర్కొన్న ఆయన, ఆర్థిక మందగమనం ఇందుకు ఒక కారణంకాగా, ఉద్దేశపూర్వక ఎగవేతదారులు కొందరని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని అన్నారు. స్టీల్, జౌళి, విద్యుత్, రహదారుల వంటి కీలక రంగాల పునరుద్ధరణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.