Bankruptcy bill
-
మార్కెట్ కు దివాలా బిల్లు జోష్
♦ 7,900కు నిఫ్టీ...52 పాయింట్లు లాభం ♦ 193 పాయింట్ల లాభంతో 25,790కు సెన్సెక్స్ మారిషస్ పన్ను భయాలను దివాలా బిల్లు ఆమోదం పొందడం కొంత వరకు తగ్గించడంతో గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ వంటి బ్యాంక్ షేర్ల జోరుతో బీఎస్ఈ సెన్సెక్స్ 193 పాయింట్లు పెరిగి 25,790 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 7,900 పాయింట్ల వద్ద ముగిశాయి. సంస్కరణల్లో జాప్యం జరుగుతున్నా భారత్ 7.3% వృద్ధిని సాధించగలదన్న ఐక్యరాజ్యసమితి నివేదిక సానుకూల ప్రభావం చూపించింది. మార్చి పారిశ్రామికోత్పత్తి, ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో (మార్కెట్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వెలువడ్డాయి) సెంటిమెంట్ మెరుగపడింది. క్యాపిటల్ గూడ్స్ సూచీ మినహా అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. దివాలా బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడంతో బ్యాంక్ షేర్లు ఒక వెలుగు వెలిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్ 3.4% పెరిగి రూ.232 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో బాగా పెరిగిన షేర్ ఇదే. ఎస్బీఐ 1.87% పెరిగి రూ.188 వద్ద, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1 % పెరిగి రూ.1,150 వద్ద ముగిశాయి. దివాలా కేసులను త్వరితంగా పరిష్కారమయ్యేలా చూసే దివాలా బిల్లు ఆమోదంతో బ్యాంక్‌ల వంటి రుణ సంస్థలు తమ మొండి బకాయిలను త్వరితంగా రికవరీ చేసుకోగలవని బీఎన్పీ పారిబా మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్ (ఈక్విటీస్) శ్రేయాశ్ దేవాల్కర్ చెప్పారు. మళ్లీ రూ.5 లక్షల కోట్లకు టీసీఎస్ మార్కెట్ క్యాప్ ఐటీ దిగ్గజం, టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మళ్లీ గురువారం రూ.5 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది. 2014 జూలైలో తొలిసారిగా ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5 లక్షల కోట్లకు చేరింది. -
దివాలా బిల్లుకు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ: దివాలా బిల్లుకు బుధవారం రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. లోక్‌సభలో ఈ బిల్లుకు మే 5నే ఆమోదముద్ర పడింది. రెండు సభలు ఆమోదం తెలపడంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. సుదీర్ఘకాలయాపన లేకుండా... కంపెనీలు, వ్యక్తులు అందరికీ ప్రయోజనం కలిగేలా నిర్థిష్ట కాల వ్యవధుల్లో దివాలా సమస్యల పరిష్కారం, తద్వారా రుణ సమస్యల నివారణ ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. దివాలాకు సంబంధించి 12 విభిన్న చట్టాల స్థానంలో తాజా బిల్లును కేంద్రం తీసుకువచ్చింది. చర్చకు ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్‌సిన్హా సమాధానం ఇస్తూ... దీనిని చరిత్రాత్మక బిల్లుగా అభివర్ణించారు. దివాలా వ్యవహారాల ప్రక్రియ మొత్తం 180 రోజుల్లో పూర్తికావాలని బిల్లు నిర్దేశిస్తోంది. -
దివాలా బిల్లుకు స్టాండింగ్ కమిటీ ఓకే
♦ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ♦ ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే చర్చ న్యూఢిల్లీ: దివాలా బిల్లుకు పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆమోదముద్ర వేసినట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలిపారు. మొండిబకాయిల (ఎన్పీఏ)లపై జరిగిన ఒక సమావేశంలో బుధవారం నాడు ఆయన మాట్లాడుతూ, ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం తగిన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రుణ ఎగవేతదారులపైనే కాకుండా గ్యారెంటార్లపై సైతం సర్ఫేసీ చట్టం ప్రకారం తగిన చర్యలను తీసుకోవలసినదిగా బ్యాంకులకు సూచించడం జరిగిందని జైట్లీ తెలిపారు. రుణ డిఫాల్టర్లు రెండు రకాలుగా ఉన్నారని పేర్కొన్న ఆయన, ఆర్థిక మందగమనం ఇందుకు ఒక కారణంకాగా, ఉద్దేశపూర్వక ఎగవేతదారులు కొందరని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని అన్నారు. స్టీల్, జౌళి, విద్యుత్, రహదారుల వంటి కీలక రంగాల పునరుద్ధరణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.