ఐసీఐసీఐ బ్యాంక్ అదనపు గృహ రుణం!
- దేశంలో మొట్టమొదటి ‘తనఖా’ హామీ ఆధారిత పథకం
- 20 శాతం వరకూ అదనపు రుణం
- రుణ కాల వ్యవధి పొడిగింపు అవకాశం
ముంబై: దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ బుధవారం సరికొత్త గృహ రుణ పథకాన్ని ప్రారంభించింది. అదనపు గృహ రుణం పొందే అవకాశాన్ని తద్వారా కల్పిస్తోంది. ఈ తరహా పథకం ఆవిష్కరణ దేశంలో ఇదే తొలిసారి. అమెరికా, కెనడాల్లో ఈ తరహా పథకాలు ప్రాచుర్యం పొందాయి. బ్యాంక్ చీఫ్ చందా కొచర్ పథకాన్ని ప్రారంభించారు. ముఖ్యాంశాలు ఇవీ...
- ‘ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్‌ట్రా హోమ్ లోన్స్’ ప్రొడక్ట్‌గా ఇది ప్రారంభమైంది.
- ఇది ‘తనఖా’ హామీ ఆధారిత పథకం.
- 20 శాతం వరకూ అదనపు రుణం దీనివల్ల లభ్యం అవుతుంది.
- రుణ చెల్లింపు కాల వ్యవధి ఏడేళ్ల (67ఏళ్ల వయస్సు వరకూ) వరకూ పెంచుకునే వీలుంది.
- ఈ సౌలభ్యతలను పొందడానికి రుణం పొందే ప్రారంభ దశలోనే ఒకేసారి కొంత మార్టిగేజ్ గ్యారంటీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- మొత్తం రుణ పరిమాణంలో గరిష్టంగా 2 శాతం వరకూ ఈ ఫీజు ఉంటుంది.
- అదనపు రుణం, ఫీజు నిర్ణయం పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. రుణ గ్రహీత వయస్సు.. రుణ కాలపరిమితి పొడిగింపు.. రుణ గ్రహీతకు ఆదాయ వనరు.. సంబంధిత వ్యక్తి ఏదైనా ఉద్యోగస్తుడా? లేక స్వయం ఉపాధి పొందుతున్నాడా... రుణం-ఆస్తివిలువ నిష్పత్తి తత్సంబంధ అంశాలు అన్నింటిపై ఆధారపడి అదనపు రుణం అందుకు సంబంధిత ఫీజ్ నిర్ణయం చేస్తారు.
- ఇండియా మార్టిగేజ్ గ్యారంటీ కార్పొరేషన్ భాగస్వామ్యంతో ఈ పథకం అమలవుతుంది. ఈ కార్పొరేషన్ ఇంక్రిమెంటల్ రిస్క్‌కు గ్యారంటీగా ఉంటుంది.
- మధ్య వయస్సున్న వ్యక్తులు, స్వయం ఉపాధి ఆధారంగా జీవనం సాగిస్తున్న వ్యక్తుల ప్రయోజనాల కోసం ప్రధానంగా ఈ పథకాన్ని ఉద్దేశించడం జరిగిందని బ్యాంక్ ఈడీ రాజీవ్ సబర్వాల్ తెలిపారు.
తనఖా మార్కెట్ వృద్ధికి దోహదం: కొచర్
తమ బ్యాంక్ తాజా చొరవ దేశంలో మార్టిగేజ్(తనఖా) మార్కెట్ వృద్ధికి దోహదపడుతుందని కొచర్ తెలిపారు. రుణ గ్రహీతలకు ఇబ్బందులేవీ పెరక్కుండా... కస్టమర్లకు మెరుగైన రుణ సౌలభ్యతను ఈ తరహా పథకాలు అందిస్తాయని వివరించారు. కాగా, చైనా ప్రభావం వల్ల వచ్చిన ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని భారత్ ఎదుర్కొంటున్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారీ విదేశీ మారకద్రవ్య నిల్వలు, కరెంట్ అకౌంట్, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక అంశాల్లో సానుకూలతలు దేశానికి కలిసివచ్చే అంశాలని సైతం అన్నారు.