సీఈఓ గది, ఇన్‌సెట్‌లో నజ్రీన్ హసన్
న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ పేలడంతో ఓ కంపెనీ సీఈఓ మృత్యువాత పడ్డారు. మలేషియాలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మలేషియా పత్రికల కథనం ప్రకారం.. క్రాడిల్ ఫండ్ కంపెనీకి నజ్రీన్ హసన్(45) సీఈఓ. ఆయన వద్ద బ్లాక్‌బెర్రీ, హువాయ్ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. అయితే ఇంటివద్ద తన గదిలో ఛార్జింగ్ పెట్టిన ఫోన్లలో ఒకటి అకస్మాత్తుగా పేలిపోవడంతో నజ్రీన్ మృతిచెందాడని ఆయన బంధువు తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఫోన్ పేలడంతో దాని భాగాలు మెడ వెనుక భాగం, తలలోనూ గట్టిగా గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావమై సీఈఓ మృతిచెందారు. అయితే ఏ ఫోన్ పేలిందో కచ్చితమైన సమాచారం తమవద్ద లేదని పోలీసులు తెలిపారు. ఫోన్ పేలిన తర్వాత రూములో అలుముకున్న దట్టమైన పొగవల్ల ఊపిరాడక కొంత సమయానికే నజ్రీన్ హసన్ చనిపోయారని చెప్పారు. అందరు భావిస్తున్నట్లు అగ్నిప్రమాదం వల్ల ఆయన మరణించలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.
క్రాడిల్ ఫండ్ అనేది మలేషియాకు చెందిన సంస్థ. వ్యాపారరంగంలోకి అడుగుపెట్టే నూతన సంస్థలకు ఆర్థికంగా సహకారం అందిస్తుంది. గత 15 ఏళ్లుగా నజ్రీన్ హసన్ క్రాడిల్ ఫండ్‌లో సేవలందిస్తూ ఎంతో మంది కొత్త వ్యాపారవేత్తలకు ఆదర్శంగా నిలిచారు. వ్యాపారవేత్త నజ్రీన్‌కు భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment