న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాలు, టెలికం సేవలతో పాటు అన్ని రకాల సర్వీసులకూ ఆధార్ సంఖ్యను అనుసంధానించడానికి కేంద్రం ఇచ్చిన గడువును సుప్రీంకోర్టు నిరవధికంగా పొడిగించటం మొబైల్ వాలెట్ సంస్థలకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టింది. పేటీఎం, మొబిక్విక్ వంటి ప్రీపెయిడ్ ఇనుస్ట్రుమెంట్ సంస్థలు (పీపీఐ) ఆర్‌బీఐ గడువును ఆధారంగా చేసుకుని ఇప్పటికే తమ కస్టమర్ల కేవైసీ వివరాలను తీసుకునే పనిని ఆరంభించాయి. అయితే కేవైసీ వివరాల కోసం ఇవన్నీ ప్రధానంగా ఆధార్ సంఖ్యపైనే ఆధారపడుతున్నాయి. కారణం... ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ ఎలక్ట్రానిక్ తరహాలో సులువుగా పూర్తయిపోతుండటం... దానికి ఖర్చు కూడా తక్కువ కావటమే.
అయితే, ఆధార్ చెల్లుబాటుపై విచారణ పూర్తయ్యేంత వరకు గడువును పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కస్టమర్లు తమ ఆధార్ నంబర్ ఇవ్వటానికి, బయోమెట్రిక్ వివరాలివ్వటానికి ఆసక్తి చూపించకపోవచ్చనేది పరిశ్రమ వర్గాల తాజా అంచనా. మొబైల్ వాలెట్ సంస్థలన్నీ ఫిబ్రవరి 28 నాటికి తమ కస్టమర్లకు సంబంధించి పూర్తి కేవైసీ వివరాలను సమీకరించాలన్నది ఆర్‌బీఐ ఆదేశం. కేవైసీ వివరాలు లేని ఖాతాల్లో కొత్తగా నగదు జమ చేయటం వంటి లావాదేవీల్ని ఆర్‌బీఐ నిషేధించింది కూడా.
దీంతో కేవైసీ వివరాలను సమీకరించి, యూజర్లను కాపాడుకోవటానికి వాలెట్ సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆర్‌బీఐ గడువు ముగిశాక రూ.12,000 కోట్లు విలువ కలిగిన ప్రీపెయిడ్ వాలెట్ పరిశ్రమ లావాదేవీలు దాదాపు 60 శాతం వరకూ తగ్గిపోయినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి కూడా. ఈ సమయంలో సుప్రీంకోర్టు ఆధార్ గడువు పొడిగించడం తమకు ఇబ్బందికరమేనని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు పూర్తి గందరగోళానికి దారితీసిందని మొబిక్విక్ సీఈవో బిపిన్ ప్రీత్‌సింగ్ ట్వీటర్‌లో పేర్కొన్నారు కూడా.
ఆధార్‌తోనే కేవైసీ ఎందుకంటే..!
నిజానికి కేవైసీ వివరాలను నమోదు చేయటానికి ప్రభుత్వం ఆమోదించిన ఏ గుర్తింపు కార్డునయినా తీసుకోవచ్చని వాలెట్ కంపెనీలకు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కానీ, మొబిక్విక్, పేటీఎం వంటి సంస్థలు ఆధార్ బయోమెట్రిక్ డేటాబేస్‌పైనే ప్రధానంగా ఆధారపడుతున్నాయి. ఎందుకంటే ఇది వేగంతో కూడినదే కాక చౌక కావడమే. ‘‘కేవైసీకి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. పేపర్ డాక్యుమెంట్ ఆధారంగా చేసే ప్రక్రియతో యూజర్లకు అసౌకర్యం. కంపెనీలకు వ్యయ భారం. అదే ఆధార్‌తో అయితే ధ్రువీకరణ డిజిటల్ విధానంలో వేగంగా పూర్తవుతుంది’’ అని ఓ పేమెంట్ కంపెనీ సీఈవో వ్యాఖ్యానించారు.
పలు ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులున్న ఓ వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తాజా పరిణామాలపై మాట్లాడుతూ... ‘‘కంపెనీలు ఆధార్ ఆధారిత కేవైసీని రూ.25లోపు ఖర్చుతోనే పూర్తి చేసుకోగలవు. అదే గతంలో మాదిరి పేపర్ ఆధారిత కేవేసీని పూర్తి చేయాలంటే ఎంతలేదన్నా రూ.500 ఖర్చు చేయాల్సి ఉంటుంది’’ అని తెలిపారు.
ఇక పేపర్ డాక్యుమెంట్లను తీసుకుంటే భద్రతాపరమైన రిస్క్ ఎదురవుతుందని, ప్రతీ కస్టమర్‌కు సంబంధించిన వివరాలతో డేటా నిర్వహించాల్సి వస్తుందని, ఇది మోసగాళ్లకు వరంగా మారుతుందన్న అభిప్రాయాన్ని కూడా పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆధార్ అయితే ఆ వివరాలు సంస్థల వద్ద ఉండవు. నంబర్ మాత్రమే ఉంటుంది. ఆ నంబర్‌కు సంబంధించి అన్ని వివరాలు యూఐడీఏఐ వద్దే ఉంటాయి.
తప్పదంటే చేసేదేమీ లేదు...
సుప్రీంకోర్టు గడువు పొడిగించినప్పటికీ, కేవైసీకి ఆధార్ తీసుకోవడంపై ఎటువంటి నిషేధం లేనందున కంపెనీలు ఆధార్ ఆధారిత ఈ కేవైసీ విషయంలో ముందుకు వెళ్లే ఆలోచనతోనే ఉన్నాయి. అదే సమయంలో అవసరమైతే ఇతర గుర్తింపు పత్రాలైన డ్రైవింగ్ లైసెన్స్, పాన్ ద్వారా కేవైసీ పూర్తి చేసేందుకూ సిద్ధమవుతున్నాయి.
ప్రభుత్వం ఆమోదించిన ఇతర డాక్యుమెంట్ల ద్వారా కూడా కేవైసీ పూర్తి చేసేందుకు తాము అనుమతిస్తున్నట్టు ఆక్సిజెన్ సర్వీసెస్ జాయింట్ ఎండీ సునీల్ కులకర్ణి తెలిపారు. అయితే, కేవైసీ పూర్తి చేసే విషయంలో కస్టమర్ల నుంచి స్పందన పెద్దగా లేదని, ఇది ఇంకా పెరగాల్సి ఉందని చెప్పారాయన. ఇక మరో వాలెట్ సంస్థ మొబిక్విక్ తొలుత ఆధార్ నంబర్‌ను మాత్రమే తీసుకోగా, కొన్ని రోజులుగా కేవైసీ కింద ఇతర గుర్తింపు కార్డులను కూడా ఆమోదించడం మొదలు పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment