23 తర్వాత స్టార్టప్‌లతో కలసి సాగుతా: రతన్ టాటా
బెంగళూరు: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పలు కొత్త సవాళ్లను విసిరినా భారతీయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, వ్యాపార దిగ్గజాలు తమను తాము వాటిని ఎదుర్కొనేందుకు అనువుగా తీర్చిదిద్దుకోగలరని టాటా గ్రూపు తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా అన్నారు. ‘‘గత కొన్ని నెలలుగా ఎదురైనా సమస్యలు వ్యక్తిగతంగా నాకు, స్టార్టప్ కమ్యూనిటికీ సవాళ్లు వంటివి. ట్రంప్ కొత్త సవాళ్లను మన ముందుంచారు.
వీటిని ఎదుర్కొనేందుకు వీలుగా మనల్ని మనం ఆవిష్కరించుకోగలం’’ అని రతన్ టాటా మంగళవారం బెంగళూరులో స్టార్టప్‌లపై జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు. స్టార్టప్ కమ్యూనిటీలో భాగం కావాలనుకుంటున్నానని, ఈ రంగం తనకు ఎంతో ప్రేరణ ఇచ్చిందని, ఈ రంగానికి తన సేవలు అందిస్తానని చెప్పుకొచ్చారు. ఈ నెల 23న టాటాసన్స్ బాధ్యతలు చంద్రశేఖరన్‌కు అప్పగించాక స్టార్టప్‌లతో కలసి పనిచేస్తానన్నారు. స్టార్టప్ విజయవంతం కావాలంటే అదృష్టం, అంతర్‌దృష్టి, నిర్ణయం తీసుకోగల సామర్థ్యం ఇవన్నీ అవసరమని అభిప్రాయపడ్డారు.