50 వేల యూరోల తస్కరణ  | 50 thousand euros has been Theft | Sakshi
Sakshi News home page

50 వేల యూరోల తస్కరణ 

Published Mon, Mar 25 2019 1:54 AM | Last Updated on Mon, Mar 25 2019 1:54 AM

50 thousand euros has been Theft - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చెన్నైకి చెందిన మహ్మద్‌ మురాద్‌ అనే వ్యాపారి నుంచి తస్కరణకు గురైన యూరోలను పట్టుకోవడానికి శాంతిభద్రతల విభాగం, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. మనీ ఎక్స్‌ఛేంజ్‌ కోసం మురాద్‌ హోలీనాడు హైదరాబాద్‌కు వచ్చాడు. ఆయన వద్దనున్న యూరోలను గుర్తుతెలియని వ్యక్తి తస్కరించాడు. మురాద్‌ కొన్నాళ్లు చెన్నైలోని ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌లో ఉద్యోగం చేసి 11 నెలల క్రితం తన సోదరుడు మీరాన్‌ ముఖ్తర్‌తో కలసి చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలో మాబ్‌ మనీఛేంజర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను ఏర్పాటు చేశారు.

మనీ ఎక్స్‌ఛేంజ్‌ మార్కెట్‌ చెన్నై కంటే హైదరాబాద్‌లో అనువుగా ఉన్నట్లు మురాద్‌ గుర్తించారు. తమకు అవసరమైనప్పుడు సిటీకి వచ్చిన శివంరోడ్‌లో ఉన్న జైన్‌ ఫారెక్స్‌ సంస్థలో ఎక్స్‌ఛేంజ్‌ చేసుకుని వెళ్తుంటారు. ఈ క్రమంలో చెన్నై సమీపంలోని మాధవరం నుంచి లిమోలైనర్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో గత బుధవారం రాత్రి బయలుదేరి గురువారం హైదరాబాద్‌కు చేరుకున్నారు.  

50 వేల యూరోలతో నగరానికి... 
మురాద్‌ తనతోపాటు భారత్‌ కరెన్సీలో రూ.39 లక్షల విలువైన 50 వేల యూరోలను నగరానికి తీసుకువచ్చారు. గత గురువారం ఉదయం 8.30 గంటలకు దిల్‌సుఖ్‌నగర్‌లో బస్సు దిగిన మురాద్‌ అక్కడ నుంచి నేరుగా జైన్‌ ఫారెక్స్‌ సంస్థకు వెళ్లారు. ఆ దుకాణం మూసి ఉండటంతో ఫోన్‌ ద్వారా ఆ సంస్థకు చెందిన సజ్జన్‌ను సంప్రదించారు. అయితే, ఆ రోజు హోలీ పండుగ కావడంతో తాము దుకాణం తెరవమని, మరుసటి రోజు రావాల్సిందిగా సజ్జన్‌ సూచించారు. దీంతో తన వద్ద ఉన్న డబ్బుతో నగరంలో బస చేయడం ఇబ్బందిగా ఉంటుందని భావించిన మురాద్‌ రైలులో తిరిగి చెన్నైకు వెళ్లిపోవాలని భావించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. సమీపంలోని ఓ ప్రార్థనాస్థలంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు.

కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తూ యూరోలతో కూడిన బ్యాగ్‌ను తాను కూర్చున్న కుర్చీలో పెట్టారు. తిరిగి వచ్చి చూసుకునేసరికి ఆ బ్యాగ్‌ మాయమైంది. ఎవరో దొంగిలించారని నిర్ధారించు కుని గోపాలపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించిన బ్యాగ్‌లో 50 వేల యూరోలతోపాటు రూ.2 వేల నగదు, ఇతర పత్రాలు ఉన్నట్లు పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవలే వ్యాపారం ప్రారంభించిన తమకు ఆ మొత్తం చాలా ఎక్కువని, ఎత్తుకెళ్లిన సొమ్ము రికవరీ కాకుంటే జీవితం రోడ్డున పడాల్సి వస్తుందని మురాద్‌  వాపోయారు. దీంతో గోపాలపురం పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు రంగంలోకి దిగి కేసును కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement