
చర్ల (భద్రాచలం): సెలవు మంజూరు చేయలేదనే ఆక్రోశంతో సీఆర్‌పీఎఫ్ జవాన్ విచక్షణారహితంగా కాల్పులు జరిపి నలుగురు సహచరులను పొట్టనబెట్టుకున్నాడు. మరొకరిని తీవ్రంగా గాయపరిచాడు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రాబల్య బీజాపూర్ జిల్లాలోని బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని 168వ సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ శిబిరంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు ఎస్సైలు, ఒక ఏఎస్సై, ఒక కానిస్టేబుల్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ ఎస్సైలను వికీ శర్మ, మేఘ్ సింగ్‌లుగా, ఎఏస్సైని రజ్వీర్ సింగ్‌గా, కానిస్టేబుల్‌ను శంకరరావు(ఏపీలోని విజయనగరం జిల్లావాసి)గా గుర్తించారు.
గజానంద్ అనే మరో ఏఎస్సై గాయాలపాలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కానిస్టేబుల్ సనత్ కుమార్ తన ఏకే 47 సర్వీసు తుపాకీతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. దంతెవాడ రేంజ్ డిప్యూటీ ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఇటీవల సనత్‌కుమార్ సెలవు కోసం దరఖాస్తు చేసుకోగా అందుకు పైస్థాయి అధికారులు నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. దీంతో విచక్షణ కోల్పోయి కాల్పులు జరిపాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మిగతా సిబ్బంది సనత్‌ను అడ్డుకోవడంతో ప్రాణ నష్టం తగ్గినట్లు తెలిసింది. గాయపడిన ఏఎస్సై, మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్‌లో ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు తరలించారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment