
నిందితుడిని అరెస్టు చేసిన తాలూకా పోలీసులు
ఒంగోలు క్రైం : పదేళ్లు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న హత్య కేసు నిందితుడిని ఒంగోలు తాలూకా పోలీసులు ఎట్టకేలకు ఆదివారం కటకటాల వెనక్కి నెట్టారు. ఒంగోలు బలరాం కాలనీలో 2008లో ఒక రిక్షా నడుపుకొనే వ్యక్తిని రాళ్లతో కొట్టటంతో అతడు చికిత్స పొందుతూ చనిపోయాడు. ఒంగోలు కోర్టులో కేసు నడుస్తోంది. న్యాయస్థానం అతడికి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారెంట్ పెండింగ్‌లో ఉంది. ఈ మేరకు ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ బి.సుబ్బారెడ్డి, కానిస్టేబుల్ బి.సోంబాబులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉన్నాడన్న సమాచారం రావటంతో అత్యంత కష్టం మీద అతడిని గాలించి పట్టుకొచ్చారు.
వివరాలు.. 2008లో ఒంగోలు నగరం బలరాం కాలనీలో కళ్లు కొట్టు వద్ద జరిగిన ఘర్షణలో కబాలి అనే వ్యక్తిని స్థానికంగా నివాసం ఉంటున్న ఉప్పుతల గురవయ్య రాళ్లతో దాడి చేసి కొట్టాడు. కబాలి తీవ్రగాయాలతో వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉప్పుతల గురవయ్యపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. దాడి అనంతరం గురవయ్య ఒంగోలు విడిచిపారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు అతడిని గాలిస్తూనే ఉన్నారు. పదేళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఉన్నాడని సమాచారం రావటంతో హెడ్ కానిస్టేబుల్ బి.సుబ్బారెడ్డి, కానిస్టేబుల్ బి.సోంబాబులు అక్కడికి వెళ్లి పట్టుకొచ్చారు.
గురవయ్య స్వగ్రామం నల్గొండ జిల్లా తొట్టెంపూడి మండలం, బక్కమంతుల గూడెం. అనేక సార్లు పోలీసులు అతడి స్వగ్రామం కూడా వెళ్లివచ్చారు. అయినా ప్రయోజన లేకపోయింది. అతడిని సోమవారం కోర్టులో హాజరు పరిచారు. ఎట్టకేలకు పదేళ్ల తర్వాత అరెస్ట్ వారెంట్‌ను అమలు చేసినందుకు ఇద్దరు పోలీసులను ఎస్పీ బి.సత్య ఏసుబాబు, ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు, తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment