
వాషింగ్టన్: భారత సంతతి విద్యార్థి అమెరికాలో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర ఘటన ఫిలడెల్ఫియాలో చోటుచేసుకుంది. స్థానిక మీడియా వివరాల మేరకు... వివేక్ సుబ్రమణి(23) అనే యువకుడు డ్రెగ్జిల్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యనభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి జనవరి 11సాయంత్రం తను నివాసం ఉంటున్న అపార్టుమెంటు పై అంతస్తుకు వెళ్లాడు. అనంతరం ఒక బిల్డింగు పైనుంచి మరో బిల్డింగుపైకి వారు దూకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ వివేక్ సుబ్రమణి జారి కిందపడిపోయాడు.
ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న వివేక్ స్నేహితులు కిందకు వచ్చి అతడికి శ్వాస అందించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అతడిని థామస్ జెఫర్‌సన్ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించగా అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా వివేక్ మృతితో అతడి సన్నిహితులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. డాక్టర్ కావాలని కలలుగన్న వివేక్ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రమాద సమయంలో వివేక్ మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment