ఓటీపీలు లేకుండానే రూ.లక్షలు కొట్టేశారు | Online Shopping Without OTP Frauds Arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

ఓటీపీలు లేకుండానే రూ.లక్షలు కొట్టేశారు

Published Tue, Oct 30 2018 8:58 AM | Last Updated on Tue, Oct 30 2018 8:58 AM

Online Shopping Without OTP Frauds Arrest in Hyderabad - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పోలీసుల అదుపులో నిందితులు

సాక్షి, సిటీబ్యూరో: వారు ముగ్గురు బిహార్‌ యువకులు. పదో తరగతి వరకు చదివిన వారు ప్లంబర్లుగా పని చేసేవారు. బతుకుదెరువు నిమి త్తం నగరానికి వలసవచ్చిన వీరు యూట్యూబ్‌ వీడియోల ద్వారా ఓటీపీ నంబర్లు లేకుండానే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే వెసులుబాటు ఉన్న ఈ–కామర్స్‌ సైట్లపై అధ్యయనం చేశారు.డెబిట్‌ కార్డు నంబర్‌లు, పిన్‌ నంబర్లు, సీవీవీ తెలిస్తే చాలు కార్డు కాలపరిమితి చెప్పే ఆన్‌లైన్‌ అప్లికేషన్లపై పట్టు సాధించారు. ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చినట్లుగా నటిస్తూ ముందున్న ఖాతాదారులు నగదు డ్రా చేస్తున్న సమయంలో కార్డు వివరాలను సోల్డర్‌ సర్ఫింగ్‌ ద్వారా తెలుసుకుని ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవారు. ఇలా దాదాపు 200 మంది నుంచి దాదాపు రూ.15లక్షలకు పైగా కాజేసిన ఈ మిత్ర త్రయాన్ని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి  18 సెల్‌ఫోన్లు, ఐదు సిమ్‌కార్డులు, రూ.1,10,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్స్‌ డీసీపీ జానకీ షర్మిలా, సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌లతో కలిసి పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ సోమవారం వివరాలు వెల్లడించారు.

బాధితుల డబ్బుతోనే విమానయానం...
బిహార్‌ రాష్ట్రం గోపాల్‌గంజ్‌ జిల్లా, బంతారియా–జగదీశ్‌ గ్రామానికి చెందిన మనీష్‌ కుమార్‌ తొమ్మిదో తరగతి చదివాడు. ఆన్‌లైన్‌పై పట్టు సాధించిన అతను అదే గ్రామానికి చెందిన స్నేహితుడు వినోద్‌ కుమార్, సెమర్‌ గ్రామానికి చెందిన మంజేష్‌ కుమార్‌తో కలిసి ఫిబ్రవరిలో బతుకు దెరువు కోసం షాద్‌నగర్‌కు వలస వచ్చి ఓ ప్రైవేట్‌ పైపులైన్‌ కంపెనీలో ప్లంబర్లుగా చేరారు. జీతం చాలకపోవడంతో మనీష్‌ కుమార్‌ సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఆన్‌లైన్‌ మోసాలను ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో షాద్‌నగర్‌లోని ఏటీఎం కేంద్రాలకు వెళ్లి డబ్బులు చేసేవారిలా నటిస్తూ ముందున్న వారి కార్డు వివరాలు సేకరించేవారు. అనంతరం బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి ఖాతాదారునిగా చెప్పుకుని ఖాతాలో నగదు వివరాలు తెలుసుకునేవారు. అనంతరం ‘బ్యాంక్‌ కార్డు వాలిడిటర్స్‌’ యాప్‌ ద్వారా ఆ డెబిట్‌ కార్డు కాలపరిమితి తెలుసుకొని, ఓటీపీ నంబర్‌ అవసరం లేని  ఈ–కామర్స్‌ వెబ్‌సైట్ల నుంచి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, గోల్డ్‌ కాయిన్స్‌ కొనుగోలు చేసేవారు. ఇందుకుగాను తరచూ సెల్‌ఫోన్‌ నంబర్లు, మెయిల్‌ ఐడీలు మారుస్తూ వేర్వేరు చిరునామాలు ఇచ్చేవారు. తాము బుక్‌ చేసిన వస్తువులను తెచ్చుకునేందుకు ఇతర నగరాలకు వెళ్లేందుకోసం విమాన టికెట్లను కూడా బాధితుల డబ్బులతోనే బుక్‌ చేసుకునేవారు. నాలుగు నెలలుగా  షాద్‌నగర్‌ నుంచి తమకు తెలియకుండా బ్యాంక్‌ ఖాతాల నుంచి  షాపింగ్‌ చేస్తున్నట్లు తన సెల్‌కు ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయని పేర్కొంటూ దాదాపు 75 బాధితులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 10న రూ.3,89,500 పోయినట్లు  ఫిర్యాదు అందడంతో పోలీసులు దీనిపై దృష్టి సారించారు. 

దొరికిపోయింది ఇలా...
సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌కు వచ్చిన ఫిర్యాదులు ఎక్కువగా షాద్‌నగర్‌ నుంచే ఉండటంతో ఆయా బ్యాంక్‌ ఖాతాదారులతో ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ నేతృత్వంలోని బృందం మాట్లాడింది. శంషాబాద్, షాద్‌నగర్‌ బస్టాండ్లు, షాద్‌నగర్‌ ఏటీఎంకు సమీపంలో  డెలివరీ చేసిన వస్తువుల వివరాలపై డెలివరీ బాయ్‌లను విచారించారు. ఏటీఎంలలోని సీసీటీవీ కెమెరాల పుటేజీల ఆధారంగా మనీష్, వినోద్‌లను పట్టుకున్న పోలీసులు వారి వివరాల ఆధారంగా మంజేష్‌ కుమార్‌ను అరెస్టు చేశారు. ‘ఇప్పటివరకు వీరి సెల్‌ఫోన్‌ ద్వారా లభ్యమైన సమాచారాన్ని బట్టి 200 మంది వరకు బాధితులు ఉన్నారు. వీరు పాత డేటాను డిలీట్‌ చేయడంతో ఇంకా చాలా మంది బాధితులు ఉండొచ్చు. పోలీసు కస్టడీకి తీసుకొని విచారించి పూర్తి విషయాలు తెలుసుకుంటామ’ని సీపీ సజ్జనార్‌ తెలిపారు.  ‘బ్యాంక్‌ కార్డు వాలిడిటర్స్‌’ కు నోటీసులు జారీ చేస్తామన్నారు. బ్యాంక్‌లు కూడా ఫిర్యాదు అందినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఇన్‌ స్పెక్టర్‌ కె.శ్రీనివాస్, ఎస్‌ఐ గౌతమ్, హెడ్‌కానిస్టేబుల్‌ సిద్దేశ్వర్, సిబ్బందిని సీపీ అభినందించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement