
సాక్షి, లక్నో : దేశంలో అసహనం పెరిగిపోతోందని మూకదాడులను నిర్మూలంటూ పలువురు గాయకులు, నటులు, మేధావులతో కూడిన 49మంది దేశ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తోంటే..మరోవైపు గాయకుడు రెచ్చగొట్టే పాటను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి ఇరుక్కున్నాడు. ‘ జై శ్రీరామ్’ అని ఉచ్ఛరించేందుకు ఇష్టపడని వారిని కబరిస్తాన్(శ్మశానం) పంపాలనే ("జో నా బోలే జై శ్రీ రామ్, ఉస్కో భెజో కబ్రిస్తాన్") పాటను యూ ట్యూబ్‌లో షేర్ చేశాడు గాయకుడు వరుణ్ బహార్. అశ్లీల, అసభ్యకరమైన, రెచ్చగొట్టే పాటలతో తరచూ యూట్యూబ్ ఛానెల్‌లో హల్‌చల్ చేయడం వరుణ్‌కు అలవాటు. ఇప్పటికే వరుణ్‌పై పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మంకపూర్‌లోని బండారా గ్రామం లో బహర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే కోర్టుముందు హాజరుపరుస్తామన్నారు.
కాగా దేశంలో అసహనం, మూకదాడులను నిర్మూలించాలని కోరుతూ ప్రధాని మోదీకి 49 మంది సెలబ్రిటీలు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రముఖ సింగర్ శుభా ముద్గల్, నటి కొంకణా సేన్ శర్మ, దర్శకుడు శ్యామ్ బెనగల్, మణిరత్నం, క్రీడాకారుడు అనురాగ్ కశ్యప్ తదితరులు వీరిలో ఉన్నారు.