సాక్షి, గూడూరు\ మదనపల్లె క్రైం: తమకు నచ్చిన చదువు చదివించలేని తల్లిదండ్రుల నిస‍్సహాయతకు కలత చెందిన ఇద‍్దరు విద్యార్థినులు బలవన్మరణాలకు యత్నించారు. తన స్నేహితులు జైపూర్‌లో ఏజీ బీఎస్సీ చదువుతుండగా అక‍్కడికి పంపడానికి తల్లిదండ్రులు వీలుకాదని చెప‍్పడంతో కుమిలిపోయిన నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన ఒక విద్యార్థిని ఉరి వేసుకోగా, ఆర్థిక ఇబ‍్బందుల వల‍్ల ఇక చదివించలేమని తల్లిదండ్రులు చెప‍్పడంతో మనోవేదనకు గురైన చిత్తూరు జిల్లా మదనపల‍్లెకు చెందిన మరో విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. మంగళవారం సంచలనం సృష్టించిన ఈ రెండు సంఘటనలకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి....
ఏజీ బీఎస్సీ చదివించలేదని...
జైపూర్ వెళ్లి ఏజీ బీఎస్సీ చదువుకుంటానని చెప్పిన కుమార్తెను, పరిశ్రమలో పనిచే స్తూ జీవనం సాగిస్తున్నతండ్రి ఆర్దిక స్దోమత లేక బీఎస్సీ ( బీబీసీ)లో చేర్పించడంతో మానసిక వేదనకు గురైన ఆ విద్యార్దిని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని అశువులు బాసిన సంఘటన పట్టణంలోని నరసింగరావుపేటలో మంగళవారం చోటు చేసుకుంది.
కొద్ది రోజులుగా తమ కుమార్తె ప్రవర‍్తన సరిగా లేదని, ఏదో అలిగుంటుందిలే అనుకున్న తమను నిలువునూ ముంచేసి వెళ్లిందని తల్లిదండ్రులు విలపించడం అక్కడున్న వారందన్నీ కంటతడి పెట్టించింది. బంధువులు వివరాల మేరకు గూడూరు రెండో పట్టణంలోని నరసింగరావుపేట ప్రాంతానికి చెందిన పెద్దపూడి వీరభద్రం అలియాస్ బ్రహ్మాజీ, భాగ్యలక్ష్మిల కుమర్తె శృతి (19) స్దానిక డీఆర్‌డబ్ల్యూ కళాశాలలో బీఎస్సీ ( బీబీసీ) మొదటి సంవత్సరం చదువుతోంది. శృతి స్నేహితులు జైపూర్‌లో ఏజీ బీఎస్సీ చదువుతున్నారు. దీంతో శృతి కూడా తన స్నేహితులతో కలసి జైపూర్ వెళ్లి అక్కడ ఏజీ బీఎస్సీ చదువుకుంటానని తండ్రి వీరభద్రంతో చెప్పింది. ఓ పరిశ్రమలో పనులకెళ్తూ అతి కష్టమీద కుటుంబాన్ని లాక్కొస్తున్న వీరభధ్రం మన ఆర్థిక పరిస్థితి బాగాలేదమ్మా... పైగా అంత దూరం వెళ్లి ఒంటరిగా నీవూ రాలేవు... మాకూ భయంగా ఉంటుందని తమ కుమార్తెకు అర్దమయ్యేలా నచ‍్చజెప్పారు. అయినప్పటికీ తమ స్నేహితులు ఫోన్‌లో శృతితో మాట్లాడినప్పుడల్లా దిగులుగా కన్పించేదని శృతి తల్లిదుండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజుల నుంచీ కూడా తమ కుమార్తె తమతో మాట్లాడకుండా ఉందన్నారు. ఒక పూట భోంచేస్తే.. మరో పూట చేయకుండానే పడుకునేదని, దీంతో ఏదో అలిగుంటుందిలే అనుకున్నామని, ఇలా ఆత్మహత్యకు పాల్పడి తమను ముంచేసి వెళ్లిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడప్పుడూ ఫోన్ కాల్స్ వస్తుండేవని, ఫోన్ వచ్చినప్పుడు చాలా బాధపడుతూ ఉండేదని, పోలీసులు ఫోన్ నంబర్లను పరిశీలించి చూస్తే తమ బిడ్డ మృతికి కారణాలు తెలుస్తాయని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదువు వద‍్దన‍్నందుకు...
తల్లిదండ్రులు చదివించలేమని చెప్పడంతో ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన మదనపల్లెలో మంగళవారం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నక్కలదిన్నెతాండాకు చెందిన క్రిష్ణమూర్తి కుమార్తె సింధూజ(22) స్థానికంగా ఉన్న ఓ ప్రయివేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బి.టెక్ చదువుతోంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా తల్లితండ్రులు సింధూజను చదువు మానేయమనడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మ హత్యాయత్నం చేసింది. గమనించిన ఇరుగుపొరుగువారు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సింధూజ ఆస‍్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున‍్న ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment