కథువా కేసు విచారణకు ముందుకొచ్చిన సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా మైనర్ బాలికపై లైంగిక దాడి కేసును చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్ధానం ముందుకొచ్చింది. న్యాయస్థానానికి కేసుకు సంబంధించిన వాస్తవాలను లిఖితపూర్వకంగా అందిస్తే ఈ కేసును పరిశీలించేందుకు సుప్రీం కోర్టు సుముఖత వ్యక్తం చేసింది. ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయకుండా న్యాయవాదులు చేపడుతున్న ఆందోళనలు, బాధితురాలి కుటుంబాన్ని న్యాయవాదులు బెదిరింపులకు లోనుచేయడం గురించి లిఖితపూర్వకంగా తమకు సమర్పిస్తే కేసు విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
దేశాన్ని కుదిపివేసిన మైనర్ బాలికపై లైంగిక దాడి, దారుణ హత్య కేసును సమోటోగా స్వీకరించాలని సుప్రీం కోర్టు న్యాయవాదుల బృందం సర్వోన్నత న్యాయస్ధానానికి విజ్ఞప్తి చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ ఈ అంశాన్ని చేపట్టాలని ఢిల్లీ న్యాయవాదులు కోరిన మీదట కోర్టు ఈ మేరకు స్పందించింది. ఈ కేసులో వాస్తవాలన్నింటినీ తాము లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పిస్తామని న్యాయవాదులు తెలిపారు. కథువా కేసులో ఏడుగురు నిందితులపై చార్జిషీట్ దాఖలును అడ్డుకునేందుకు ఓ వర్గానికి చెందిన న్యాయవాదులు క్రైమ్ బ్రాంచ్ పోలీసులను నిలువరించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment