![Three suspects arrested in Sudheer murder case - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/14/add.jpg.webp?itok=d_8_oXUC)
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ భుజంగరావు, సీఐ ప్రసన్నకుమార్. చిత్రంలో నిందితులు
హైదరాబాద్: ‘అందరి ముందూ అవమానించాడు.. జనమంతా చూస్తుండగా చేయి చేసుకున్నాడు.. ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడాడు.. ఈ అవమానం భరించలేక అంతం చేయాలని నిర్ణయించుకున్నాం.. నలుగురు స్నేహితులం కలసి పరీక్ష రాయడానికి వెళ్తున్న సుధీర్‌ను నడిరోడ్డుపై వేటకొడవళ్లతో నరికి హత్యచేశాం..’సుధీర్ హత్య కేసులో కూకట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులు వెల్లడించిన విషయాలివీ. సోమవారం కూకట్‌పల్లిలో దారుణ హత్యకు గురైన ఇంటర్ విద్యార్థి సుధీర్ కేసులో ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. మంగళవారం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూకట్‌పల్లి ఏసీపీ ఎన్.భుజంగరావు, సీఐ వడ్డే ప్రసన్నకుమార్ వివరాలు వెల్లడించారు.
హత్యకు దారి తీసిన గొడవ..
ఇంటర్ చదువుతున్న మూసాపేటకు చెందిన ఎలగల సుధీర్(19) ఈ నెల 9న స్థానిక సభ్యత గ్రౌండ్‌లో అదే ప్రాంతానికి చెందిన ఇప్పలి కృష్ణ స్నేహితులతో గొడవ పడ్డాడు. సుధీర్‌ను కృష్ణ ప్రశ్నించడంతో.. వారిద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. సుధీర్.. కృష్ణపై చేయి చేసుకున్నాడు. గొడవ విషయాన్ని సుధీర్ సోదరుడు ప్రసాద్‌కు చెప్పాడు. అదే రోజు సాయంత్రం కృష్ణ స్నేహితులైన జిల్లా మహేశ్, నవీన్.. సుధీర్, ప్రసాద్‌లకు గొడవ జరిగింది. అందరూ చూస్తుండగానే మహేశ్, నవీన్‌ను ప్రసాద్, సుధీర్ కొట్టారు. రాత్రి 9 గంటల సమయంలో మల్లన్న ఆలయం సమీపంలోకి వెళ్లిన మహేశ్‌కు అక్కడే ఉన్న సుధీర్, ప్రసాద్‌కు మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో తనపై దాడికి పాల్పడిన సుధీర్‌ను అంతం చేయాలని మహేశ్ నిశ్చయించుకున్నాడు. స్నేహితులు కృష్ణ, నవీన్, తేజతో కలసి పథకం వేశాడు. 2 వేటకొడవళ్లను కొనుగోలు చేసి.. వాటిని తేజ హోండా యాక్టివాలో దాచిపెట్టారు. సుధీర్ కదలికలు తెలుసుకోడానికి అదే ప్రాంతానికి చెందిన బైరెడ్ల శివ సహకారం తీసుకున్నారు. సోమవారం ఉదయం సుధీర్ పరీక్ష రాసేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరి వసుంధర ఆస్పత్రి రోడ్డులో వస్తున్నాడని సమాచారం అందించాడు.
కాపు కాసి.. దాడి చేసి..
దీంతో మహేశ్, మిగతా ముగ్గురు జాతీయ రహదారి పక్కనే ఉన్న సాగర్ హోటల్ వద్ద కాపు కాశారు. సుధీర్ రావడంతో అతడిని బైక్‌పై నుంచి లాగి కత్తులతో దాడి చేయడంతో రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు ప్రభాకర్, అంజి నిందితులను పట్టుకునేందుకు యత్నించగా ముగ్గురు పారిపోగా నవీన్ పోలీసులకు చిక్కాడు. అతని ద్వారా మిగతా నిందితుల సమాచారం, సంఘటనకు గల కారణాలను తెలుసుకున్న పోలీసులు.. నిందితులు జిల్లా మహేశ్, శివను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి బుల్లెట్ వాహనం,రెండు వేటకొడవళ్లు, మూడు మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల్లో ఇప్పలి కృష్ణ, తేజ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ట్రాఫిక్ పోలీసులకు కమిషనర్ చేతుల మీదుగా రివార్డును అందజేయనున్నట్లు ఏసీపీ భుజంగరావు సమావేశంలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment