ఖమ్మం జెడ్పీసెంటర్ : 2014 సాధారణ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు, ఇతర సిబ్బందికి తక్షణమే డ్యూటీ సర్టిఫికెట్లు జారీ చేయాలని సంబంధిత ఎన్నికల అధికారులను టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరి వీరబాబు డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం అర్బన్, రూరల్ తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గతేడాది మార్చిలో డ్యూటీ సర్టిఫికెట్లు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు వాటిని జారీ చేయకుండా అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు.
గత సంవత్సరం జూలైలో ఖమ్మం, పాలేరు డివిజన్ సంఘం నేతలు సర్టిఫికెట్లు జారీ చేయాలని సంబంధిత అధికారులను కోరినప్పటికీ అధికారులు ఖాతరు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే కలెక్టర్ ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25లోగా సర్టిఫికెట్లు జారీ చేయాలని, లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి మహబూబ్‌అలీ, జిల్లా కార్యదర్శి కృష్ణారావు, మండల కార్యదర్శి శంకర్రావు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
2014 ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్లు ఇవ్వాలి
Published Tue, Jan 10 2017 3:17 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM
Advertisement
Advertisement