ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటం
మహిళా దినోత్సవం నాడు ఓ మహిళ తనకు న్యాయం చేయా లని వేడుకొంటూ రోడ్డెక్కింది
ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది
నక్కపల్లి: ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఓ వివాహిత మొదట ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, తరువాత కుటుం బ సభ్యులు, కొంతమంది గ్రామస్తులతో కలసి అతని ఇంటిముందు మౌన దీక్షకు దిగింది. మంగళవారం న్యాయంపూడిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు తెలిపిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. న్యాయంపూడికి చెందిన గోరింట లోవలక్ష్మి అనే మహిళకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో భర్తతో విడాకులు తీసుకుంది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో నాలుగేళ్ల క్రితం నుంచి ఈమె ఇదే గ్రామానికి చెందిన పెదపూడి వీరబాబు అనే వ్యక్తితో సఖ్యతగా ఉం టోంది. వీరబాబుకు, అతని కుటుంబ సభ్యులు వివాహం చేయడానికి నిర్ణయించారు. రెండు రోజుల క్రితం వేరే అమ్మాయితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. ఈ విషయం తెలిసిన లోవలక్ష్మి అతనిని నిలదీసింది.
అయితే వీరబాబు నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో మనస్తాపానికి గురైన లక్ష్మి సోమవారం రాత్రి చీమల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను కుటుంబ సభ్యులు నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించారు. ప్రస్తుతం ఈమె ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె వీరబాబు ఇంటి ముందు మౌన దీక్షకు దిగింది. కొంతమంది గ్రామస్తులు, లక్ష్మి కుటుంబ సభ్యులు ఆమెకు మద్దతుగా వీరబాబు ఇంటి ముందు ధర్నాకు దిగారు. వీరబాబు తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో అతనితో సఖ్యతగా ఉన్నానని, ఇప్పుడు మోసం చేసేందుకు యత్నిస్తున్నాడని లోవలక్ష్మి తెలిపింది.