పవర్ ‘ఫుల్’..
ప్రయోగాత్మకంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అమలు
► 3 లక్షలకు పైగా వ్యవసాయ కనెక్షన్లకు వర్తింపు
► ప్రస్తుతం 11.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం
► రూ.44.5 కోట్ల పనులకు ప్రతిపాదనలు
► అన్నదాతకు అండగా సర్కార్..వెల్లివిరుస్తున్న ఆనందం..
విద్యుత్ కోసం రాత్రి, పగలు మోటార్ల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు విద్యుత్ పంపిణీలో విప్లవాత్మక మార్పులకు సర్కారు సంస్కరణలు తీసుకొచ్చింది. వ్యవసాయానికి నిరంతరాయంగా 24 గంటలపాటు విద్యుత్ సరఫరాకు పచ్చజెండా ఊపింది. ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ వరంగల్ కంపెనీ పరిధిలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంగళవారం నుంచి ప్రయోగాత్మకంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 3,00,105 వ్యవసాయ కనెక్షన్లకు 24 గంటల విద్యుత్ అందనుంది. – సాక్షి, కరీంనగర్/కొత్తపల్లి
సాక్షి, కరీంనగర్/కొత్తపల్లి: వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు తెలంగాణ ఉత్తర పంపిణీ విద్యుత్ సంస్థ కరీంనగర్ సర్కిల్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రయోగాత్మకంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో సోమవారం శ్రీకారం చుట్టిన సర్కార్ ఒక అడుగు ముందుకేసి ఉ మ్మడి కరీంనగర్ జిల్లాలో మంగళవారం నుంచి ప్రయోగాత్మకంగా 24 గంటలపాటు విద్యుత్ సరఫరాకు పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ నిర్ణయంతో అన్నదాతల్లో ఆనందంగా వెల్లివిరుస్తోంది. ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయానికి డిమాండ్ మేరకు విద్యుత్ లేకపోవడం.. వి ద్యుత్ సరఫరా జరుగుతున్న సమయంలో ఏకకాలంలో విద్యుత్ మోటార్లను ఆన్ చేయడంతో ఓవర్‌లోడ్‌తో గతంలో ఇబ్బందులు ఏర్పడేవి.
వాటిని అధిగమించేందుకు 9 గంటల విద్యుత్ సరఫరాకు రూ.250 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించారు. కానీ.. ప్రస్తుతం విద్యుత్‌తోపాటు సాగుకు అవసరమైన నీరు అందుబాటులో ఉండటంతో అవసరమున్న సమయంలో మాత్రమే రైతులు కరెంట్ వాడుతున్నారు. దీంతో విద్యుత్ భారం చాలా వరకు తగ్గింది. ఇదే సమయంలో ప్రయోగాత్మకంగా 12 గంటల విద్యుత్ సరఫరాను విద్యుత్ అధికారులు అమలు చేశారు. దీన్ని ఆసరాగా చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా తొలుత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 24 గంటల విద్యుత్ సరఫరాను అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆఖరి క్షణాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో అమలుకు శ్రీకారం చుట్టింది.
మంగళవారం నుంచి కరీంనగర్ సర్కిల్‌లో అమలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు అవసరమైన పనుల్లో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తలమునకలవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్ర స్తుతం అన్ని కేటగిరీల విద్యుత్ కనెక్షన్లకు 11.5 మిలి యన్ యూనిట్లను వినియోగిస్తుండగా.. 24 గంటల విద్యుత్ సరఫరాతో కొంత వాడకం పెరిగి డిమాండ్ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సమస్యగా కెపాసిటర్ బ్యాంకులు.‘ఆటోమేటిక్ స్టార్టర్ల’పై ఆందోళన..
జిల్లాలో 315 సబ్‌స్టేషన్లలో 120 చోట్ల కెపాసిటర్ బ్యాంకర్లు లేక విద్యుత్ సమస్య తలెత్తుతోంది. సబ్‌స్టేషన్లలో ప్రస్తుతం 109 కెపాసిటర్ బ్యాంకుల బిగింపు పనులు జరుగుతున్నాయి. లో ఓల్టేజీ సమస్యతోపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు వీలుంటుంది. విద్యుత్ వినియోగ తీవ్రతను బట్టి మిగిలిన కేంద్రాల్లో కూడా బిగించనున్నారు. కాగా.. ఎక్కువ శాతం మంది రైతులు ఆటోమేటిక్ స్టార్టర్లను వాడుతున్నారు. గతంలో నెలకొన్న విద్యుత్ సమస్యల కారణంగా వాటిని వాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 9 గంటల విద్యుత్ సరఫరా.. ప్రస్తుతం 24 గంటలు కరెంట్ ఇచ్చేందుకు నిర్ణయించింది. దీంతో మోటార్లు నిరంతరాయంగా నడిచి విద్యుత్ వృథా కావడంతోపాటు మోటార్లు కాలిపోయే ప్రమాదం ఉంది. ఆటోమేటిక్ స్టార్టర్లు తొలగిస్తారో.. లేదో అన్న ఆందోళన అధికారుల్లో మొదలైంది.
రూ.44.5 కోట్ల ప్రతిపాదనలు..కొత్తగా 15 సబ్‌స్టేషన్లు.. 6 విద్యుత్ లైన్లు..
24 గంటలపాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.44.5 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 18 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, 15 సబ్‌స్టేషన్లు, విద్యుత్ తీగలు, స్తంభాలు, కెపాసిటర్ బ్యాంకులు, ఏబీ స్కిచ్చులు, బే ఎక్స్‌టెన్షన్ పనులు చేపట్టాలని నిర్ణయించారు. 5 ఎంవీఏ సామర్థ్యం గల 6 పవర్ ట్రాన్స్‌ఫార్మర్ పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. అంతేగాకుండా 3.5 ఎంవీఏ సామర్థ్యం గల పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను 5 ఎంవీఏకు, 5 ఎంవీఏ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్లను 8 ఎంవీఏ సామర్థ్యానికి పెంచే చర్యలు చేపట్టనున్నారు.
24 గంటల విద్యుత్ సరఫరా సందర్భంగా సమస్య తలెత్తే చోటే అవసరమైన పరికరాలను అమర్చే చర్యలు చేపట్టనున్నారు. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 315 సబ్‌స్టేషన్లు ఉండగా 24 గంటల విద్యుత్ సరఫరాకు మరో 15 సబ్‌స్టేషన్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు. అంకిరెడ్డిపల్లి, కానాపూర్, వెన్నంపల్లి, ఉప్పరమల్యాల, చిప్పలపల్లి, రహీంఖాన్‌పేట్, మద్దిమర్ల, గునుకులకొండాపూర్, బస్వాపూర్, గంభీర్‌పూర్, నామ్సాన్‌పల్లి, హనుమంతునిపేట, మేడారం, దామెర, బండలింగాపూర్ గ్రామాల్లో కొత్తగా సబ్‌స్టేషన్లు నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అదేవిధంగా కొత్తగా ఆరు కె.వీ. లైన్లను నిర్మించాలని నిర్ణయించారు.
ఆటోమేటిక్ స్టార్టర్లు తొలగించాలి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంగళవారం నుంచి ప్రయోగాత్మకంగా 24 గంటల విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టాం. బోరు మోటర్లకున్న ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించాలి. ఒకవేళ తొలగించకపోతే విద్యుత్ మోటార్లు కాలిపోయే ప్రమాదంతోపాటు విద్యుత్ వృథా అవుతుంది. ప్రభుత్వం అందిస్తున్న విలువైన విద్యుత్‌ను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి. విద్యుత్ సిబ్బంది, ఉద్యోగులకు రైతులు సహకరించాలి. సమస్యలుంటే స్థానికంగా ఉన్న విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలి.
– కె.మాధవరావు, ఎస్‌ఈ, కరీంనగర్ సర్కిల్