ప్రదర్శన నిర్వహిస్తున్న జేఏసీ నాయకులు
- జూలూరుపాడు, ఏన్కూరు మండలాల వాసుల డిమాండ్
- జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శన.. ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి
కొత్తగూడెం:
జూలూరుపాడు, ఏన్కూరు మండలాలను నూతనంగా ఏర్పడనున్న కొత్తగూడెం జిల్లాలో కలపాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కొత్తగూడెంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. వేలాది మంది ప్రజలు కొత్తగూడెం మండలంలోని విద్యానగర్ కాలనీ నుంచి పాదయాత్రగా బయలుదేరి బస్టాండ్ మీదుగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. సుమారు రెండు గంటలపాటు కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. నూతనంగా ఏర్పడనున్న కొత్తగూడెం జిల్లాకు అతి సమీపంలో ఉన్న జూలూరుపాడు, ఏన్కూరు మండలాలను ఆ జిల్లాలోనే కలపాలని జేఏసీ కన్వీనర్ లకావత్ గిరిబాబునాయక్ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలోనే ఆయా మండలాలను ఉంచడం వల్ల ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఓ ఎం.వి.రవీంద్రనాథ్‌కు వినతిపత్రం అందచేశారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని, ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు మాళోతు రాందాస్‌నాయక్, గుగులోతు ధర్మానాయక్, ఎల్లంకి కృష్ణయ్య, చీమలపాటి భిక్షం, కోకన్వీనర్ వాంకుడోత్ వెంకన్న, రోకటి సురేష్, గురునాథం, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు లావుడ్యా హభుమా, కట్రం మోహన్‌రావు, చింతా జగన్నా«థం, సపావట్ దేవి, వాసం రామకృష్ణ, కట్రం నరసింహారావు, కాన్షీరాంనాయక్, రాజేష్‌నాయక్, రమేష్‌నాయక్, చందర్‌నాయక్, లావుడ్య సత్యనారాయణ, బాలాజీ, శాంతిలాల్ పాల్గొన్నారు.