కాపు మంత్రులతో చంద్రబాబు అత్యవసర భేటీ
విశాఖపట్నం: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష చేస్తుండటంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదివారం విశాఖపట్నంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు అత్యవసరంగా సమావేశమయ్యారు.
ముద్రగడ చేత బలవంతంగా దీక్ష విరమింపజేస్తే రాజకీయంగా దెబ్బతింటామని టీడీపీ కాపు నేతలు చంద్రబాబు వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. కాగా ముద్రగడ వద్దకు చర్చలకు వెళితే ఓ మెట్టు దిగినట్టు అవుతుందని కాపు నేతలతో చంద్రబాబు అన్నారు. ముద్రగడ దీక్ష కొనసాగిస్తే కాపుల రిజర్వేషన్ల ఉద్యమం తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు.. ప్రత్యామ్నాయ మార్గాలపై టీడీపీ కాపు నేతలతో మంతనాలు జరిపారు.