నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు
– డీఈఓ బి. ప్రతాప్‌రెడ్డి
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ నిబంధనల మేరకు సెలవులు ప్రకటించిన తర్వాత కూడా పాఠశాలలను నిర్వహిస్తే చర్యలు తప్పవని డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి పాఠశాలల యాజమాన్యానికి హెచ్చరించారు. దసరా సెలవులను ప్రకటించినా నగరంలోని పలు పాఠశాలలను శుక్రవారం కూడా నిర్వహించడంతో డీఈఓ ప్రతాప్‌రెడ్డితోపాటు కార్యాలయ సిబ్బంది దాడులు నిర్వహించారు. పాఠశాలలను నిర్వహించే పలు యాజమాన్యాలకు హెచ్చరించి పిల్లలను ఇళ్లకు పంపించి వేశారు. డీఈఓ మాట్లాడుతూ సెలవుల సమయంలో పాఠశాలల్లో పిల్లలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యలన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు పాఠశాలలను నిర్వహిస్తే డిప్యూటీ ఈఓలతోపాటు ఆయా మండలాల ఎంఈఓలదే బాధ్యత అన్నారు. దాడుల్లో డీఈఓ తోపాటు ఆర్‌జేడీ, డీఈఓ కార్యాలయ సిబ్బంది రమేష్ బాబు, నాగరాజు, బాదుల్లా, తదితరులు పాల్గొన్నారు.