మృత శిశువును తొలగించక యాతన
Published Tue, Nov 22 2016 11:44 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
తీవ్ర వేదనకు గురైన మహిళ ∙
సిబ్బంది నిర్లక్ష్యంపై బంధువుల ఆందోళన
కాకినాడ వైద్యం : కడుపులో చనిపోయిన బిడ్డను శస్త్రచికిత్స చేసి బయటకు తీయడంలో వైద్య సిబ్బంది చేస్తున్న జాప్యంపై రోగి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకెళితే రాజమండ్రికి చెందిన బుంగా సంధ్యశ్రీ రెండో కాన్పు నిమిత్తం సోమవారం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. మంగళవారం సంధ్యశ్రీకి పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. ౖవైద్య పరీక్షల అనంతరం కడుపులో బిడ్డ చనిపోయాడు. ఇక్కడ శస్త్రచికిత్స చేసి, మృతశిశువును బయటకు తీసేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేకపోవడంతో కాకినాడ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించినట్లు ఆమె భర్త సునీల్ తెలిపారు. దాంతో చేసేది లేక అంబులెన్సులో మధ్యాహ్నం 1.30 గంటలకు తన భార్యను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా, శిశు విభాగంలో చేర్చారు. సాయంత్రం దాకా ఎటువంటి చికిత్స చేయకపోవడంతో కడుపు నొప్పి ఎక్కువై తీవ్ర వేదనకు గురైందని, ప్రాణాపాయం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్‌కి ఫిర్యాదు చేసినా కిందస్థాయి సిబ్బంది పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు అందుబాటులో లేరు. కాస్త సమయం ఓపిక పట్టండంటూ వైద్యాధికారులు చెబుతున్నారని వాపోయారు. ఆస్పత్రిలో అన్ని పరికరాలు అందుబాటులో ఉండికూడా టెస్ట్‌లను ప్రైవేట్‌గా చేయించుకోమని చెబుతున్నారని ఆరోపించారు.
Advertisement
Advertisement