సీబీఐకి చిక్కిన ఎక్సైజ్ సూపరింటెండెంట్
సీబీఐకి చిక్కిన ఎక్సైజ్ సూపరింటెండెంట్
Published Tue, May 9 2017 10:28 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
నంద్యాల: బీడీ ఫ్యాక్టరీ యజమాని నుంచి రూ.10వేల లంచం తీసుకుంటూ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సతీష్‌కుమార్ సీబీఐ అధికారులకు పట్టుబడ్డారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని పార్కు రోడ్డు ప్రాంతానికి చెందిన ఆరిఫ్ 2012లో కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖ నుంచి లైసెన్స్ తీసుకుని నెంబర్ 12 బీడీ ఫ్యాక్టరీ నెలకొల్పారు. రెండు మూడేళ్లకే నష్టాలు వచ్చాయి. అయితే ప్రతి ఏడాది కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖకు సర్వీసు ట్యాక్స్ చెల్లించడంతో పాటు రికార్డులను సమర్పించాల్సి ఉంది.దీంతో ఆయన ఫ్యాక్టరీని మూసివేయాలని నిర్ణయించుకుని లైసెన్స్ రద్దు చేయాలని ఇటీవల ఎక్సైజ్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే లైసెన్స్ రద్దుకు రూ.15వేలు ఇవ్వాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ డిమాండ్ చేయగా.. రూ.10వేలు ఇచ్చేందుకు ఆరిఫ్ ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన సతీష్‌కుమార్‌పై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖ కేంద్రం పరిధిలో ఉండటంతో ఏసీబీ అధికారులు ఫిర్యాదును సీబీఐకి పంపారు. ఈ మేరకు సతీష్‌కుమార్‌కు బాలాజీ కాంప్లెక్స్‌లోని మధుమణి నర్సింగ్ హోం ప్రాంతంలో ఉన్న ఒక దుకాణంలో ఆరిఫ్ రూ.10వేలు అందజేశారు. వెంటనే సీబీఐ డీఎస్పీ బషీర్, సీఐలు రాజేంద్రకుమార్, రాఘవేంద్రకుమార్ దాడి చేసి నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సతీష్‌కుమార్‌ను శ్రీనివాసనగర్‌లోని కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తరలించి విచారించారు. అనంతరం ఆయనను హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి తరలించారు.
Advertisement