వెంకన్న 'వడ్డీ' కట్టించుకున్నాడు! | Gubba Muniratnam Charities Rs. 2 crores given to TTD | Sakshi
Sakshi News home page

వెంకన్న 'వడ్డీ' కట్టించుకున్నాడు!

Published Sun, May 8 2016 10:17 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 PM

వెంకన్న 'వడ్డీ' కట్టించుకున్నాడు!

వెంకన్న 'వడ్డీ' కట్టించుకున్నాడు!

తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా హోటల్ నిర్వహణ
వడ్డీతో కలిపి అద్దె రూ.2 కోట్లు కట్టేందుకు ముందుకొచ్చిన సత్రం
సానుకూలంగా స్పందించిన టీటీడీ

 
తిరుమల: వడ్డి కాసులవాడా.. వేంకటరమణా.. గోవిందా.. గోవింద! అన్న నామస్మరణ నిత్యం తిరుమల క్షేత్రంలో మారుమోగుతుంటుంది. తిరుమల కొండమీద తప్పు చేసిన వారు వడ్డీతో సహా పరిహారం చెల్లించాల్సిందే. ఇలాంటి సంఘటనే పునరావృతమైంది. నిబంధనలు అతిక్రమించి 27 ఏళ్లుగా హోటల్ నిర్వహించిన సత్రం తప్పు ఒప్పుకుంది. హోటల్ అద్దె కింద వసూలు చేసిన నగదు వడ్డీతోపాటు రూ.2 కోట్లు  చెల్లించేందుకు ముందుకు రావటంతో టీటీడీ కూడా సానుకూలంగా స్పందించింది.
 
తిరుమలకొండ మీద ఎలాంటి వసతి సదుపాయాలు లేని రోజుల్లో శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కోసం మఠాలు, సత్రాలు వెలిశాయి. దీనికి ఆనాటి తిరుమల గ్రామ పంచాయతీ అనుమతులు, తర్వాత టీటీడీ అనుమతులు ఉన్నాయి. ఇందులో భాగంగానే దక్షిణ భారత ఆర్యవైశ్య కన్యకాపరమేశ్వరి ధర్మ పరిపాలన సంస్థ (గుబ్బా మునిరత్నం చారిటీస్) సంస్థకు స్థలం ఇచ్చారు.
 
ఆ మేరకు  ఆలయ పడమట మాడ వీధిలో సత్రం ఏర్పడింది. మాస్టర్‌ప్లాన్ కింద ఆ సత్రాన్ని 1989లో ప్రస్తుతం మ్యూజియం ప్రాంతంలోకి తరలించి అత్యాధునిక వసతులతో కొత్త సత్రాన్ని నిర్మించారు.  ఆ సందర్భంగా టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా సత్రంలో హోటల్ ఏర్పాటుచేశారు. దీనికి సత్రం నెలసరి అద్దె వసూలుచేసింది. ఈ విషయంలో కొన్నేళ్లుగా టీటీడీ, సత్రం మధ్య వివాదం నడిచింది. కోర్టులో కే సు తీర్పు టీటీడీకి అనుకూలంగా వచ్చింది.
 
అయినప్పటికీ మెతకవైఖరి అవలంభించారు. టీటీడీ ఈవోగా డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఆదేశాలతో సత్రంలోని హోటల్‌ను గత ఏడాది డిసెంబరు 8న సీజ్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న హోటల్‌ను కూలదోశారు. ‘‘తిరుమల గ్రామ నిబంధనలు, టీటీడీ చట్టానికి విరుద్ధంగా 27 ఏళ్లుగా హోటల్ నిర్వహించారు.. సత్రం అనుమతి ఎందుకు రద్దు చేయకూడదు?’’ అంటూ ఎస్టేటు విభాగం నోటీసులు ఇచ్చింది.  ఈ విషయాన్ని టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా కూడా సంబంధిత సత్రానికి నోటీసులు ఇప్పించారు.
 
వడ్డీతో కలిపి అద్దె చెల్లించేందుకు అంగీకారం

తెలిసో, తెలియకో సత్రంలో హోటల్ నిర్వహించి 27 ఏళ్లుగా అద్దె కింద వసూలు చేసిన మొత్తానికి వడ్డీతో కలిపి రూ.2 కోట్లు చెల్లిస్తామని సంబంధిత సత్రం నిర్వాహకులు టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇచ్చారు. మరోసారి ఇలాంటి పొరపాటు లేకుండా దేవస్థానం నిబంధనలు తుచ తప్పక పాటిస్తామని  శుక్రవారం సంబంధిత ఎస్టేటు విభాగం అధికారులను కలసి బదులిచ్చారు.
 
దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమేరకు సత్రం నిర్వాహకులకు అనుమతులు ఇచ్చారు. ఈ సత్రం నిర్వాహకులతో సంబంధం లేకుండానే అప్పటి రాజకీయ పెద్దలు ఒత్తిడితోనే హోటల్ ఏర్పాటైనట్టు కూడా టీటీడీ అధికారులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement