ప్రభుత్వ స్థలంలో.. ‘తమ్ముళ్ల’ పాగా
ప్రభుత్వ స్థలంలో.. ‘తమ్ముళ్ల’ పాగా
Published Wed, Apr 26 2017 11:01 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
– పట్టాలు లేకుండానే ఇళ్ల నిర్మాణం
– ఆకుతోటపల్లి పంచాయతీలో 1.94 ఎకరాలు కబ్జా
– అక్కడ సెంటు స్థలం రూ.3 లక్షలకు పైనే...
– రాప్తాడు నియోజకవర్గ పరిధి కావడంతో అడ్డుకునేందుకు జంకుతున్న అధికారులు
(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
ఇళ్ల నిర్మాణం కోసం పునాదులు తీసిన ఈ స్థలం అనంతపురం సమీపంలోని ఆకుతోటపల్లి పంచాయతీ పరిధిలోనిది. ఇక్కడ సెంటు స్థలం ధర రూ.3 లక్షలకు పైనే ఉంది. ప్రభుత్వం ఎవ్వరికీ ఇంటి పట్టాలు ఇవ్వలేదు. అయినప్పటికీ ఇక్కడ ఇళ్ల నిర్మాణం మొదలైంది. మంత్రి పరిటాల సునీత ఆదేశాలతోనే నిర్మాణం మొదలైనట్లు తెలుస్తోంది. రాప్తాడు నియోజకవర్గ పరిధి కావడం, మంత్రి సునీత బంధువులు నేరుగా రంగంలోకి దిగడంతో అధికారులు కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఫలితం రూ.కోట్ల విలువైన స్థలం ఇళ్లులేని నిరుపేదలకు కాకుండా అధికార పార్టీ అస్మదీయుల పరమవుతోంది.
రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లి పంచాయతీ సర్వే నంబర్ 132–4ఏలో 6.18 ఎకరాల స్థలం ఉంది. అనంతపురం నగరానికి అతి దగ్గరలో సేతుస్కూలు వెనుక వైపు ఉన్న ఈ స్థలం విలువ సెంటు రూ.3 లక్షలకు పైనే! ఇక్కడ గతంలో 4.24 ఎకరాల్లో ఇందిరమ్మ కాలనీ నిర్మించారు. ప్రస్తుతం 1.94 ఎకరాలు ఖాళీగా ఉంది. సెంటు ధర కనీసం రూ.3 లక్షలు అనుకున్నా ఈ స్థలం విలువ రూ.5.82 కోట్లకు పైగానే ఉంటుంది. ఇంత విలువైన ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉంది. కానీ వారం రోజులుగా 70–80 మంది ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఇళ్లు నిర్మించుకుంటున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు.
పట్టాలివ్వకుండానే ఇళ్ల నిర్మాణమా?
ఈ స్థలాన్ని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించాలి. లేదా ఇళ్లులేని నిరుపేదలు ఉంటే, వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ముందుగా లబ్ధిదారుల ఎంపిక జరగాలి. తర్వాత తహసీల్దార్ పట్టాలివ్వాలి. ఆపై లేఅవుట్ వేసి పట్టాదారులకు ప్లాట్లను అప్పగించాలి. అయితే.. ప్రస్తుతం ఇక్కడ ఇళ్లు నిర్మిస్తున్న వారిలో ఏ ఒక్కరికీ పట్టాలివ్వలేదు. పరిటాల సునీత సమీప బంధువు పరిటాల మహేంద్ర తమ అస్మదీయులకు చెప్పి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. మంత్రి సునీత కూడా ‘అక్కడ ఇళ్లు కట్టుకునేది మా వాళ్లే! మీరెవ్వరూ అటువైపు వెళ్లొద్దు!’ అని చెప్పినట్లు సమాచారం. దీంతో అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కొంతమంది టీడీపీ నేతలు ఇళ్ల స్థలం అవసరమైన వారి నుంచి భారీగా డబ్బు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.
తహసీల్దార్ సెలవులో ఎందుకు వెళ్లినట్లో!
అనంతపురం తహసీల్దార్ శ్రీనివాసులు ఈ నెల 24 నుంచి సెలవుపై వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. అర్హులైన పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ చేయాలనే ఆలోచన మంత్రికి, అధికారులకు ఉండి ఉంటే పదిరోజులు ఆలస్యమైనా లబ్ధిదారులను గుర్తించి, పట్టాలిచ్చిన తర్వాతే నిర్మాణానికి అనుమతి ఇవ్వొచ్చు. లేదంటే హౌసింగ్ అధికారులే కాలనీ నిర్మించి ఇవ్వొచ్చు! కానీ ఇక్కడ ఇళ్ల పట్టాలు లేకుండానే నిర్మాణానికి ఉపక్రమించడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. నిర్మాణం చేపట్టేవారిలో అర్హులతో పనిలేకుండా తాము ఇచ్చిన జాబితా మేరకు పట్టాలివ్వాలని మంత్రి సునీత ఒత్తిడి తేగా, అందుకు అంగీకరించని తహసీల్దార్ సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా,ముందు ఇళ్లు నిర్మించుకోండి.. తర్వాత పట్టాలిప్పిస్తామని పరిటాల మహేంద్ర నిర్మాణదారులతో చెప్పినట్లు తెలుస్తోంది.
పట్టాలివ్వలేదు : సుబ్రహ్మణ్యం, వీఆర్‌ఓ, ఆకుతోటపల్లి
ఇళ్ల నిర్మాణం జరుగుతోంది వాస్తవమే! మా దృష్టికి కూడా వచ్చింది. అక్కడ మేం ఎవ్వరికీ పట్టాలివ్వలేదు. ఇళ్ల నిర్మాణంపై ఉన్నతాధికారులకు తెలియజేస్తాం.
చర్యలు తీసుకుంటాం: లక్ష్మీనారాయణ, ఇన్‌చార్జ్ తహసీల్దార్, అనంతపురం
ఇళ్లనిర్మాణం చేపడుతున్నారనే విషయం మాకు తెలీదు. వెంటనే దానిపై విచారిస్తాం. పట్టాలివ్వకుండా ఎలా నిర్మాణం చేపడుతున్నారని ఆరా తీసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
విచారిస్తాం: మలోల, ఆర్డీవో, అనంతపురం
ఇళ్ల నిర్మాణం సంగతి తెలీదు. ప్రభుత్వం పట్టాలివ్వకుండా, ప్రభుత్వ స్థలంలో ఎలాంటి నిర్మాణం చేపట్టడమైనా నేరమే. దీనిపై వెంటనే విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
Advertisement