హంద్రీనీవా.. కన్నీటి తోవ | Lift cum drip irrigation hundrineeva ayakattu | Sakshi
Sakshi News home page

హంద్రీనీవా.. కన్నీటి తోవ

Published Fri, Sep 8 2017 7:29 AM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM

హంద్రీనీవా.. కన్నీటి తోవ

హంద్రీనీవా.. కన్నీటి తోవ

ఇప్పటికే 2015లో జీఓ జారీ
తెరపైకి లిఫ్ట్‌ కమ్‌ డ్రిప్‌ ఇరిగేషన్‌
ఉరవకొండలో 20వేల హెక్టార్లకు రూ.899 కోట్లు కేటాయింపు
ఇందులో 50 శాతం నిధులతో డిస్ట్రిబ్యూటరీలు పూర్తయ్యే అవకాశం
ప్రభుత్వ తీరుతో గందరగోళం


రాష్ట్ర ప్రభుత్వం అనంత రైతును దగా చేస్తోంది. హంద్రీనీవా ఆయకట్టుకు ఏడాదిలో నీరిస్తామని 2014లో హామీ.. ఆయకట్టుకు నీరిచ్చే డిస్ట్రిబ్యూటరీలు తీయొద్దని 2015లో  జీఓ.. 2016 ఖరీఫ్‌కు నీరిస్తామని ఎస్‌ఈ, సీఈలతో ప్రకటన.. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి భూమి సమతులంగా లేదని.. లిఫ్ట్‌ కమ్‌ డ్రిప్‌ ఇరిగేషన్‌ తీసుకొస్తున్నామని కొత్త పల్లవి. మొత్తంగా రూ.899 కోట్లకు ‘టెండర్‌’ పెడుతూ అస్మదీయులకు ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

సాక్షిప్రతినిధి, అనంతపురం:
హంద్రీనీవా ద్వారా రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు నీరందించాలని సంకల్పిస్తే అందులో 3.45 లక్షల ఎకరాల ఆయకట్టు ‘అనంత’లోనే ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఫేజ్‌–1 పనులు 2012లోనే పూర్తయ్యాయి. ఐదేళ్లుగా జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు చేరాయి. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేస్తే 1.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చే వీలుంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఏడాదిలో హంద్రీనీవా ఆయకట్టుకు నీళ్లిస్తామని సీఎం, మంత్రులు ప్రకటించారు. 2015 ఫిబ్రవరిలో కుప్పానికి నీళ్లు తీసుకెళ్లేదాకా ఆయకట్టుకు డిస్ట్రిబ్యూటరీలు చేయొద్దని జీఓ 22 జారీ చేశారు. దీనిపై విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ఉద్యమించాయి. ఈ క్రమంలో 33, 34 ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 33, 34 ప్యాకేజీ డిస్ట్రిబ్యూటరీలు పూర్తయితే 28వేల ఎకరాలకు నీరందుతుంది.

33వ ప్యాకేజీని ఈపీఐఎల్‌(ఇంజినీరింగ్‌ ప్రాజెక్టు ఇండియా లిమిటెడ్‌), 34ను ఆర్‌వీసీపీఎల్‌(రెడ్డివీరన్న కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) చేస్తున్నాయి. 33వ ప్యాకేజీలో 8.9 కిలోమీటర్లు ప్రధాన కాలువ తవ్వి.. ఆ పరిధిలో ఉప, పిల్ల కాలువలు తవ్వాలి. ఈ పనులు పూర్తయితే 10,500 ఎకరాలకు నీరందుతుంది. అయితే పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కారణమేంటని ఆరా తీస్తే.. 5–6 కిలోమీటర్‌ మధ్య రాయి ఉంది. బ్లాస్టింగ్‌ చేయాలని అధికారులు చెప్పగా.. దీన్ని పక్కనపెట్టడంతో పాటు మేజర్‌ కెనాల్‌లోని కల్వర్టులను కూడా పూర్తి చేయని పరిస్థితి. ఈ పనులకు రూ.12కోట్లు ఇచ్చారని, 2004–05 రేట్ల ప్రకారం ఉండటంతో ఏజెన్సీ పనులు చేయకుండా వెనుదిరిగిందని అధికారులు మరోమాట చెప్పారు.

34వ ప్యాకేజీలో కూడా డిస్ట్రిబ్యూటరీ–1, డిస్ట్రిబ్యూటరీ–2 అని రెండు ప్రధాన కాలువలు తవ్వాలి. ఇందులో డీ–1, 8.25, డీ–2. 22 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ తవ్వాలి. డీ–1 కింద 5వేలు, డీ–2 కింద 12, 500 ఎకరాలకు ఆయకట్టుకు నీరందుతుంది. ఈ పనులకు బ్రేక్‌ పడింది. ఇదేమంటే 33 ప్యాకేజీలాగే పాతరేట్లు అని కొర్రీ పెడుతున్నారు. నిజానికి కొత్తరేట్లు అమలు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. కాబట్టి పనులు చేస్తే ఏజెన్సీలకు ఎలాంటి నష్టం రాదు.. లాభం తప్ప. వీటితో పాటు 36 ప్యాకేజీ మరొకటి ఉంది. రూ.336కోట్లు కేటాయిస్తూ దీనికి గతేడాది ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ మూడు ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీలు పూర్తయితే 1.18లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

సమతులం పేరుతో డిస్ట్రిబ్యూటరీలను తప్పించే ఎత్తుగడ
ఉరవకొండ నియోజకవర్గంలో కమ్యూనిటీ లిఫ్ట్, డ్రిప్‌ ఇరిగేషన్‌(సీఎల్‌ఐడీ) పథకం పేరుతో రూ.899కోట్లు కేటాయిస్తూ ఈ నెల 5న ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ ప్యాకేజీల్లో భూభాగం సమతులంగా లేకపోవడంతో 11,680 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించలేని దుస్థితి నెలకొందని, అందుకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొంది. అంటే ఈ ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీలు చేయమని చెప్పకనే చెప్పినట్లయింది. అలాగే ఈ ఆయకట్టుకు నీరిందంచడానికి కేటాయించిన 1.45టీఎంసీలు, డ్రిప్‌ ఇరిగేషన్‌ అమలు చేయడం వల్ల మిగిలే 0.24 టీఎంసీలు కలిపి 1.69టీఎంసీలతో 20వేల హెక్టార్లకు అందిస్తామని పేర్కొంది. ‘ఆలీ లేదు.. చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు.. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయలేదు.. నీళ్లు ఇవ్వలేదు.. అప్పుడే 0.24 టీఎంసీలు మిగిలాయని ప్రభుత్వం ఎలా చెబుతుందో అంతుపట్టని పరిస్థితి. జీఓలో పేర్కొన్న అంశాలు, 33, 34 ప్యాకేజీల పురోగతి పరిశీలిస్తే డిస్ట్రిబ్యూటరీలను పక్కనపెట్టినట్టే అనేది సుస్పష్టమవుతోంది.

ఆయకట్టు స్థిరీకరిస్తేనే నీటిపై హక్కు
ఫేజ్‌–1లో 1.18 లక్షల ఎకరాలకు హంద్రీ–నీవాపై హక్కు రావాలంటే డిస్ట్రిబ్యూటరీలను ఏర్పాటు చేసి ఆయకట్టును స్థిరీకరించాలి. అప్పుడే ఈ నీటిపై రైతులకు హక్కు వస్తుంది. అలా కాకుండా లిఫ్ట్, డ్రిప్‌ అంటూ డిస్ట్రిబ్యూటరీని పక్కనపెడితే ఆయకట్టు స్థిరీకరణ జరగదు. దీంతో నీటిపై రైతులు హక్కును కోల్పోతారు. పైగా లిఫ్ట్‌ కమ్‌ డ్రిప్‌ ఇరిగేషన్‌కు రూ.899కోట్లు కేటాయించారు. ఫేజ్‌–1లో పూర్తిగా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేసినా అందులో 50శాతం నిధులు కూడా ఖర్చు కావు. ‘అనంత’లో సాగునీరు అందక, ఏటా రైతులు ఆత్మహత్యలకు ఉపక్రమిస్తున్నా ప్రభుత్వం మాత్రం మానవీయ కోణంలో ఆలోచించి ఆదుకునే ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement