‘మిషన్’ పనులు ముమ్మరం
► కడెంలో చకచకా సాగుతున్న మిషన్ భగీరథ పనులు
► తెలంగాణలోనే అన్నింటికన్నా ముందు
కడెం : జిల్లాలో సాగునీటి రంగంలో పెద్దదైన ప్రాజెక్టు కడెంలో ఉంది. పక్కనే ప్రాజెక్టున్నప్పటికీ తాగునీటి సమస్య ఉన్న గ్రామాలు కూడా బాగానే ఉన్నాయి. దీంతో ప్రభుత్వం కడెం ప్రాజెక్టు వద్ద రు.280 కోట్లతో ఒక భారీ స్థాయిలో వాటర్ గ్రిడ్(మిషన్ భగీరథ) పథకాన్ని చేపట్టారు. ఈ పథకం కింద కడెం, జన్నారం, ఖానాపూర్ మండలాలకు పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలకు ప్రతీ రోజు శుద్ధజలాన్ని అందించనున్నారు. అయితే ఈ నిధులతో మొదటి దశ కింద రు.30 కోట్లతో కడెం ప్రాజెక్టు మధ్య జలాశయంలో ఇంటెక్‌బావి నిర్మాణం, ఒడ్డు నుంచి 80 మీటర్ల దూరంలో నున్న ఇంటెక్ బావి వరకు ఫుట్ బ్రిడ్జిని నిర్మించారు.
రెండో దశలో రు.250 కోట్లతో స్థానిక విశ్రాంతి భవనం వెనుగ గల రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఫిల్టర్ బెడ్‌ను నిర్మించనున్నారు. ఈ నిధులతో ఇక్కడ ఫిల్టర్ బెడ్, వాటర్ ట్రీట్‌మెంటు ప్లాంటు, సంపు నిల్వ సామర్థ్యం 23లక్షల లీటర్లు కాగా మొత్తం ప్లాంటు సామర్థ్యం 2కోట్ల 30లక్షల లీటర్ల సామర్థ్యం(23ఎంఎల్డీ)గలది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.
తెలంగాణలోనే మొదటగా. . .
మొదటి దశలో పనులను హైద్రాబాదుకు చెందిన ‘ మెగా నిర్మాణ సంస్థ ’ఆద్వర్యంలో వాటర్ గ్రిడ్ పనులు కొద్దినెలలుగా ముమ్మరంగా జరుగుతున్నాయి. మొదటి దశలో చేపట్టిన పనుల్లో ఇంటేక్ వెల్ పనులు చాలా వేగంగా నిర్వహించారు. దీంతో రాష్ట్రంలో ఉన్న మిగతా 18 బావుల్లో కెల్ల కడెంలోని ఇంటేక్ వెల్ పనులే పూర్తి దశకు చేరాయి. అన్ని బావుల్లో కెల్ల స్లాబ్ వరకు నిర్మించింది రాష్ట్రంలోనే ఇది మొదటిది. బావి నిర్మాణ పనులు పూర్తి దశకు చేరటంతో వారం రోజుల నుంచి ఫిల్టర్ బెడ్ పనులు ప్రారంభించారు.
పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. కడెం ప్రాజెక్టు వద్ద నిర్మించతలపెట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా నియోజకవర్గంలోని కడెం,ఖానాపూర్,జన్నారం మండలాలకు చెందిన 293 గ్రామాలకు ప్రతీరోజు ఇక శుద్ధజలాన్ని ఉచితంగానే అందించనున్నారు. కడెం మండలంలో 103 గ్రామాలు,ఖానాపూర్ మండలంలో 111 గ్రామాలు,జన్నారం మండలంలో 79 గ్రామాలకు కలిపి ఈ నీరందించనున్నారు. రెండో దశలో పైపు లైను నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. వాటిని కొద్దిరోజుల్లోనే మొదలుపెట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్టు పనులు అనుకున్నట్లు అన్నీ సకాలంలో జరిగితే ఈ మూడు మండలాల ప్రజలు ఇక నీటి చింతను వీడాల్సిందే.
సకాలంలో పూర్తి చేస్తాం
కడెం ప్రాజెక్టు వద్ద చేపట్టిన మిషన్ భగీరథ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలతో పనులు చేయిస్తున్నాం. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. పనులను సకాలంలో పూర్తి చేస్తాం. డిసెంబరు నెలాఖరు వరకు పూర్తి చేసి కొన్ని గ్రామాలకైనా నీరందించాలనుకుంటున్నాం. - వెంకటపతి, డీఈ, మిషన్‌భగీరథ, కడెం