టీడీపీకి భవిష్యత్‌ లేదు | nofuture to tdp | Sakshi
Sakshi News home page

టీడీపీకి భవిష్యత్‌ లేదు

Published Fri, Jul 14 2017 11:28 PM | Last Updated on Fri, Oct 19 2018 8:10 PM

టీడీపీకి భవిష్యత్‌ లేదు - Sakshi

టీడీపీకి భవిష్యత్‌ లేదు

- కమిషన్లు దండుకున్న మంత్రి
- కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి  
 
నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వయస్సు మీరినందున.. కుమారుడు మంత్రి లోకేష్‌కు రాజకీయ పరిజ్ఞానం లేనందు.. టీడీపీకి భవిష్యత్తు లేదని, రాబోయే రోజులన్నీ వైఎస్సార్‌సీపీవేనని వైఎస్సార్‌ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి అన్నారు.  వైఎస్సార్‌సీపీ నేత కల్లూరి రామలింగారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటైన రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గూగుల్‌లో పప్పు అని టైప్‌ చేస్తే ఆంధ్రుల ప్రీతికరమైన వంటకం పప్పుతో పాటు లోకేష్‌ ఫొటో వస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాల నుంచి ఎన్నికైన భూమానాగిరెడ్డికి కేబినెట్‌ స్థాయి హోదా ఉన్న పీఏసీ చైర్మన​  పదవిని కట్టబెడితే ఆయన నమ్మకాన్ని వమ్ము చేసి రూ.కోట్లు దండుకొని పార్టీ ఫిరాయించారని విమర్శించారు.  వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచిన ఎంపీ ఎస్పీవైరెడ్డి ప్రమాణస్వీకారం చేయకముందే పార్టీ ఫిరాయించారన్నారు. లోక్‌సభ, శాసనసభల స్పీకర్లు సహకరించకపోవడంతో పార్టీలు ఫిరాయించిన ఎంపీలు, ఎమ్మెల్యేల స్థానంలో ఉపఎన్నికలు జరిగే అవకాశం లేదన్నారు.  
కమిషన్లను దండుకున్నారు...
మంత్రి అఖిలప్రియ కాంట్రాక్టు పనులపై 20 శాతం కమిషన్లను దండుకొని పనులను ప్రముఖ కాంట్రాక్టర్‌ ఆర్‌వీ సుబ్బారెడ్డికి అమ్మేశారని రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. ఆర్‌వీ సుబ్బారెడ్డి నూటికి నెలకు రూ.5 వడ్డీతో అప్పులు తెచ్చి పనులను చేపట్టారని, కాని ఈ బిల్లులు ఇచ్చే అవకాశం లేదన్నారు. టీడీపీ మూడేళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 35వేల ఇళ్లను  నిర్మించలేదని,  నంద్యాలలో 13వేల ఇళ్లు నిర్మిస్తామని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. 
ఎన్నికల తర్వాత జీవోలు చిత్తు కాగితాలే...
అభివృద్ధి పనులు చేస్తామని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఉప ఎన్నిక తర్వాత చిత్తుకాగితాలుగానే మిగిలిపోతాయని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి విమర్శించారు. కడప ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ నేత చెంగళరాయుడును ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకొనే సందర్భంలో రూ.వంద కోట్ల పనులకు జీవోలను విడుదల చేశారని చెప్పారు. నాలుగు నెలలు గడిచినా ఈ పనులకు టెండర్లు కూడా జరగడం లేదన్నారు. ఉప ఎన్నిక దృష్ట్యా మైనార్టీలను ఆకట్టుకోవడానికి.. మాజీ మంత్రి ఫరూక్‌కు, పార్టీలో చేరిన నౌమాన్‌కు పదవులను కట్టబెట్టారని విమర్శించారు. ఇలా ప్రలోభాలతో అనైతిక పాలన చేస్తున్న అధికార పార్టీని మళ్లీ గట్టెక్కిస్తే రాష్ట్రం సర్వనాశనమవుతుందన్నారు.  ఎమ్మెల్యే అమ్జాద్‌బాషా మాట్లాడుతూ నంద్యాల ప్రజలు ప్రశాంతతను కోరుకుంటారని, వీరు తెలివైన వారు అని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. 
అగ్రిగోల్డ్, కేశవరెడ్డి స్కామ్‌ డబ్బును చెల్లించాలి..
మంత్రి లోకేష్‌.. అగ్రిగోల్డ్‌ కుంభకోణంలో, మంత్రి ఆదినారాయణ.. కేశవరెడ్డి స్కామ్‌లో కాజేసిన డబ్బును బాధితులకు అప్పగించి, ఉప ఎన్నికలో ఓట్లు అడగాలని పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథరెడ్డి డిమాండ్‌ చేశారు. కేశవరెడ్డి విద్యాసంస్థల స్కామ్‌ వల్ల విద్యార్థుల తల్లిండ్రులు, రుణ దాతలు రూ.కోట్లలో నష్టపోయారన్నారు.  కేశవరెడ్డికి బెయిల్‌ రాకుండా మంత్రి ఆదినారాయణరెడ్డి అడ్డుకోవడంతో ..కొన్ని ప్రామిసరీ నోట్ల గడువు పూర్తయ్యిందని, దీంతో బాధితులు నష్టపోయారన్నారు. ఆదినారాయణరెడ్డికి ప్రజలు తప్పకుండా గుణపాఠం నేర్పుతారన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిని 1977 పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిపించి నంద్యాల ప్రజలు చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు. అప్పట్లో రాష్ట్రంలోని 42ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలువగా, కేవలం నీలం సంజీవరెడ్డి బీజేపీ అభ్యర్థిగా గెలిచి మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి షాక్‌నిచ్చారని చెప్పారు. ప్రస్తుతం నంద్యాల ఉపఎన్నికలో శిల్పామోహన్‌రెడ్డిని గెలిపించి, అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబునాయుడుకు గుణపాఠం నేర్పాలని చెప్పారు. రైస్‌మిల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మయ్య మాట్లాడుతూ.. గతంలో నంద్యాల ప్రజలు సౌమ్యులకే ఓట్లు వేశారని, ఉప ఎన్నికల్లో శిల్పాకు అపజయం ఉండబోదన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, కడప నగర మేయర్‌ సురేష్, వైఎస్సార్సీపీ నేత శంకర్‌రెడ్డి, నూర్‌బాషా సంఘం నేత మస్తాన్‌వలిలు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement