ఖరారు కాని విత్తన పంపిణీ
అనంతపురం అగ్రికల్చర్ : ఈ నెల 15వ తేదీ తర్వాత విత్తన వేరుశనగ పంపిణీ మొదలు పెడతామని వ్యవసాయశాఖ అధికారులు ప్రకటించగా ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటి వరకు విత్తన ధరలు, రాయితీలు ఖరారు కాకపోవడం విశేషం. ముందస్తు విత్తన పంపిణీ సన్నాహాలు అంటూ నెల రోజల నుంచే వ్యవసాయశాఖ హడావిడి చేస్తుండగా తీరా సమయం దగ్గర పడుతున్న కొద్దీ జాప్యం జరిగే పరిస్థితి నెలకొంది. దీంతో సకాలంలో రైతులకు విత్తన పంపిణీ అందడం కష్టంగా మారింది. గత ఐదారేళ్లుగా జూన్ మొదటి వారం నుంచే పంట సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే.
అంతకు మునుపు జూన్ నెలలో వేరుశనగ సాగు చేసే పరిస్థితి లేదంటున్నారు. అయితే వర్షాలు గతి తప్పడం, రుతుపవనాలు మొహం చాటేస్తుండటంతో ముందస్తు పంట సాగుకు రైతులు మొగ్గు చూపుతూ వర్షం వస్తే జూన్ మొదటి వారంలోనే మొదలు పెడుతున్నారు. అంతలోగా రైతులకు విత్తనకాయ ఇవ్వాల్సి ఉన్నా ధరలు ఖరారు కాకపోవడం, విత్తన సేకరణలో జాప్యం కావడం, ఇతరత్రా కారణాల వల్ల పంపిణీ ఆలస్యమవుతోంది. దీంతో చాలా మంది రైతులు ప్రభుత్వం అందించే రాయితీ విత్తనాన్ని నమ్ముకోకుండా బయట ప్రాంతాల్లో కొనుగోలు చేసి సమకూర్చుకుంటున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సారి ముందుగానే విత్తనం ఇస్తామని ప్రకటించడం, విత్తనశుద్ధి కార్యక్రమం, సేకరించి గోదాముల్లో నిల్వ చేసే కార్యక్రమం కొనసాగిస్తున్నారు. కానీ ధరలు, రాయితీలు ప్రభుత్వం ప్రకటించకపోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. కాగా గతేడాది ఏప్రిల్ మూడో వారంలోనే విత్తన ధరలు ప్రకటించారు. పూర్తీ ధర క్వింటాలు రూ.6,300 ఉండగా అందులో 33.3 శాతం సబ్సిడీ పోనూ రైతు వాటాగా రూ.4,200 ప్రకారం నిర్ణయించిన విషయం తెలిసిందే.