- పోలీస్ స్టేషన్‌లోనే కానిస్టేబుల్, ఎంపీపీ మధ్య వాగ్వాదం
- ఇద్దరి మధ్య తిట్ల పురాణం
- ఎస్‌ఐల ప్రేక్షకపాత్ర
గుత్తి : ఒకరు కానిస్టేబుల్. మరొకరు ఎంపీపీ. చిన్న విషయంగా వారిద్దరూ వాగ్వాదానికి దిగారు. ఒకానొక దశలో ‘నువ్వెంతంటే.. నువ్వెంత’ అనే స్థాయికి వచ్చారు. ఇదంతా ఎస్‌ఐల ముందే జరగ్గా, వారు ప్రేక్షకపాత్ర వహించారు. గుత్తి పోలీస్ స్టేషన్‌లో ఈ సంఘటన గురువారం జరిగింది.
జరిగిందేమిటంటే...
బసినేపల్లి వద్ద లారీ ఢీకొని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఆ విషయంగా మాట్లాడేందుకు ఎంపీపీ వీరేశ్, బసినేపల్లి సర్పంచు భర్త మహ్మదాలీ, మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస యాదవ్, ధర్మాపురం సర్పంచు శ్రీనివాసచౌదరి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ మోహన్ అనే కానిస్టేబుల్ ఎదురయ్యారు. అతన్ని ఉద్దేశించి.. బాబు.. మీ ఎస్‌ఐ లేరా?అని ఎంపీపీ అడిగారు. దీంతో సదరు కానిస్టేబుల్.. నన్ను బాబూ అని పిలుస్తావా? నువ్వెవరు? అంటూ ప్రశ్నించారు. కోపోద్రుక్తుడైన ఎంపీపీ.. నన్నే ఎవరంటావా?నన్నెప్పుడూ చూడలేదా? అంటూ ఎదురు ప్రశ్నించారు. ఈ విషయంగా వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి తిట్ల పురాణానికి దిగారు. ‘నీ సంగతి చూస్తా’నంటే.. నీ సంగతి చూస్తా’నంటూ ఒకర్నొకరు చాలెంజ్ చేసుకున్నారు. ఈ తతంగమంతా ఎస్‌ఐ సమక్షంలోనే జరగడం గమనార్హం. అనంతరం తమపై దురుసుగా ప్రవర్తించాడంటూ పోలీసు కానిస్టేబుల్ మోహన్‌పై ఎంపీపీ , టీడీపీ నాయకులు ఎస్‌ఐకు ఫిర్యాదు చేశారు.