- డిప్యూటీ సీఎం చినరాజప్ప
- సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి చర్యలు
Published Sat, Sep 17 2016 9:55 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
మధురపూడి :
రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూమిపూజ చేయనున్న నేపథ్యంలో.. సంబంధిత ఏర్పాట్ల పరిశీలనకు రాజప్ప శనివారం ఇక్కడకు వచ్చారు. సీఎం సభ, ఎంఓయూ, భూమిపూజ జరిగే ప్రాంతాలను పరిశీలించారు. వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, ఇప్పటికే విజయవాడ ఎయిర్‌పోర్టు అభివృద్ధి పూర్తయిందన్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం విస్తరణకు 850 ఎకరాలు సేకరించామని తెలిపారు. ఆ భూములకు రూ.350 కోట్ల పరిహారం చెల్లించామన్నారు. కడప, తిరుపతి, భోగాపురం విమానాశ్రయాల అభివృద్ధికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయ విస్తరణ పనులకు సంబంధించిన భూమిపూజకు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు ఎం.వెంకయ్య నాయుడు, పి.అశోక్‌గజపతిరాజు తదితరులు వస్తారని తెలిపారు. కొందరు రైతులకు భూ పరిహారం అందలేదని విలేకర్లు ప్రస్తావించగా, లీగల్ సమస్యలు పరిష్కారమయ్యాక వారికి పరిహారం అందుతుందని చెప్పారు. అనంతరం రాజప్ప జెట్ ఎయిర్‌వేస్ విమానంలో హైదరాబాద్ వెళ్లారు.
పనుల పరిశీలనకు వచ్చిన కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, సీఎం భూమిపూజ చేయడంతో ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులు మొదలవుతాయని చెప్పారు. రూ.181 కోట్లతో రన్‌వే విస్తరణ, ప్రహరీ, ఐసొలేషన్ బే నిర్మాణ పనులు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ బి.రాజకుమారి, సబ్‌కలెక్టర్ విజయ కృష్ణన్, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎం.రాజకిషోర్, కోరుకొండ తహశీల్దార్ రియాజుద్దీన్, సీతానగరం ఎంపీడీఓ డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, వర్షం కారణంగా సీఎం పర్యటనకు ఆటంకం కలుగుతుందేమోనన్న సందేహాలు అధికారుల్లో నెలకొన్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తి చేశాక వర్షం కురిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన చెందుతున్నారు.
Advertisement