- దూరవిద్య పరీక్షల షెడ్యూల్
- ప్రకటించ నిఅధికారులు
- పరీక్ష కేంద్రాల ఏర్పాటుపై
- ఇంకా కొనసాగుతున్న కసరత్తు
పుష్కరాలు ముగిశాయ్.. పరీక్షలెన్నడు?
Published Mon, Aug 29 2016 12:23 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య కేంద్రం డిగ్రీ, పీజీ పరీక్షల షెడ్యూల్ వెల్లడించకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. డిగ్రీ, పీజీ పరీక్షలను ఈనెల 17వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు తొలుత వెల్లడించినా కృష్ణ పుష్కరాల పేరిట వాయిదా వేస్తున్నట్లు 15వ తేదీన వెల్లడించారు. అయితే, పుష్కరాలు ముగిసినా ఇంకా రీ షెడ్యూల్ వెల్లడించకపోవడం గమనార్హం.
కేంద్రాలు వద్దన్న యాజమాన్యాలు
కేయూ ఎస్డీఎల్‌సీఈ డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణ కోసం అధికారులు పలు కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటుచేశారు. అయితే, కొన్ని కేంద్రాల యాజమాన్యాలు తమ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు వద్దని అధికారులకు తెలియజేశారు. మరికొందరు ఎంవోయూ స్టడీసెంటర్ల యాజమాన్యాలు మాత్రం పరీక్ష కేంద్రాలు కావాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇలా పలు కారణాలతో పరీక్ష కేంద్రాల ఏర్పాటుపై ఇంకా కసరత్తు సాగుతూనే ఉంది. గతంలో ప్రకటించిన పరీక్షా కేంద్రాల్లో కొన్నింటిని తొలగించడం, కొత్త కళాశాలల్లో ఏర్పాటుచేయడం కోసం అధికారులు అన్వేషణలో ఉన్నారు. ఇక మరోవైపు అబ్జర్వర్ల డ్యూటీల కోసం కొందరు పట్టుపడుతున్నారు. పార్ట్‌టైం, కాంట్రాక్చువల్ లñ క్చరర్లు, పరిశోధకులు, పీడీఎఫ్ అభ్యర్థులు అధికారుల చుట్టూ తిరుగుతుండగా.. డ్యూటీలను ఏ ప్రాతిపదికన వేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఈ విషయమై విధివిధానాలను రూపొందించేందుకు ముగ్గురు ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటుచేయగా వారు ఓ నివేదిక రూపొందించారు. దూరవిద్య డిగ్రీ పరీక్షలు 42వేల మందికి పైగా, పీజీ పరీక్షలను 9వేల మందికి పైగా అభ్యర్థులు రాయనుండగా 90 వరకు పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. అలాగే, 110 మంది అబ్జర్వర్ల అవసరమని తెలుస్తోంది. అయితే, ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో పోటీ పడుతుండగా.. కమిటీ నివేదిక ప్రతిపాదనికన డ్యూటీలు కేటాయించాలని భావిస్తున్నారు. ఇదంతా త్వరగా పూర్తిచేసి పరీక్షల రీ షెడ్యూల్ వెల్లడించాలని అభ్యర్థులు కోరుతున్నారు.
Advertisement